ఓటీటీల మ‌ధ్య పోటీ నిర్మాత‌ల‌కు వ‌రం

Update: 2021-10-21 06:23 GMT
ఓటీటీల మ‌ధ్య పోటీ నిర్మాత‌ల‌కు వ‌రంగా మారుతోందా? అంటే అవున‌నే కొన్ని డీల్స్ ప్రూవ్ చేస్తున్నాయి. శ‌ర్వానంద్-సిద్దార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `మ‌హాస‌ముద్రం` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్..ట్రైల‌ర్..మేకింగ్  ప్ర‌చార చిత్రాల‌తో `మ‌హా స‌ముద్రం` భారీ హైప్ నే తీసుకొచ్చింది. భారీ అంచ‌నాల న‌డుమ‌ థియేట‌ర్లో  రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లితం తారుమారైంది. దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ చేసినా 10 కోట్లు కూడా తేలేక‌పోయింది. దీన్ని బ‌ట్టి సినిమా థియేట‌ర్ రిలీజ్ ప‌రంగా ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే నిర్మాత‌లు మాత్రం సేప్ జోన్ లోనే ఉన్నారు. ఎలాంటి న‌ష్టాలు లేకుండా ఊపిరి పీల్చుకున్నారు.

అందుకు కార‌ణం ఓటీటీ.. డిజిటల్ మాధ్య‌మాలేన‌ని తెలుస్తోంది. రిలీజ్ కి ముందే సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ అవ్వ‌డంతో నెట్ ప్లిక్స్ ఓటీటీ రిలీజ్ కి 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూపంలో 4 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చాయి. శాటిలైట్ రూపంలో మ‌రో 5 కోట్లు ద‌క్కాయి. ఇలా నాన్ థియేట్రిక‌ల్ రూపంలో 18 కోట్లు వ‌చ్చేసాయి. ఇలా సినిమాకి పెట్టిన పెట్టుబ‌డిని నిర్మాత‌లు తిరిగి చేజిక్కించుకోగ‌లిగారు. థియేట్రిక‌ల్  రిలీజ్ కి ముందే ఓటీటీకి అమ్మేయ‌డంతో సేవ్ అయ్యారు. లేదంటే నిర్మాత‌లు అడ్డంగా దొరికిపోయేవారని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడైతే అందులో సంగం డ‌బ్బులు కూడా వ‌చ్చేవి కాదు. ఆ ర‌కంగా ఓటీటీ సంస్థ‌లు నిర్మాత‌ల పాలిట అదృష్ణ శ‌క్తులుగా మారాయి. అయితే ఇలాంటి ఛాన్స్ గ‌తంలో చాలా సినిమాలే ద‌క్కించుకున్నాయి.

ముఖ్యంగా ద‌క్షిణాదిన తెలుగు.. త‌మిళ్ సినిమాల‌కు ఓటీటీలు ఓ వ‌రంగా మారాయ‌నే చెప్పాలి. రెండు భాష‌ల్లోనూ భారీ బ‌డ్జెట్ చిత్రాలు తెర‌కెక్కుతాయి. ఓటీటీలు సౌత్ లో ఇత‌ర భాష‌ల చిత్రాల‌కంటే ఈ రెండు లాంగ్వేజెస్  పై ఎక్కువ‌గా ఖ‌ర్చు పెట్ట‌డానికి చూస్తుంటాయి. క‌మ‌ర్శియ‌ల్  కోణంలో తెర‌కెక్కే సినిమాలు కాబ‌ట్టి ఓటీటీలు ముందుగానే పోటీ ప‌డి ఖ‌ర్చీప్  వేస్తుంటాయి.  ఓటీటీల న‌డుమ‌ ఉండే పోటీ కార‌ణంగా కోలీవుడ్.. టాలీవుడ్ చిత్రాల‌కు క‌లిసొచ్చే అంశంగా మారింది. ఓటీటీల మ‌ధ్య‌ ఈ పోటీ వాతావ‌ర‌ణం ఉన్నంత కాలం నిర్మాత‌లు సేఫ్ గేమ్ ఆడొచ్చ‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇవే ఓటీటీలు ఒక్కోసారి రింగ‌య్యి డ్రామాలాడితే నిర్మాత‌ల‌కు వెన్ను పోటు త‌ప్ప‌దు.

స‌మీక్ష‌లే పెద్ద మైన‌స్ గా మారాయా?

ఈసారి దసరా కానుకగా ప్రేక్షకులను పలకరించిన తొలి సినిమా ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఘనవిజయాన్నందుకున్న అజయ్ భూపతి రూపొందించిన చిత్రమిది. శర్వానంద్-సిద్దార్థ్ ల క్రేజీ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నా ఆశించిన రిజ‌ల్ట్ మాత్రం ద‌క్క‌లేదు. ఆరంభ‌మే స‌మీక్ష‌లు తేడా కొట్ట‌డంతో ఈ సినిమా ఫ‌లితం కూడా తిర‌గ‌బ‌డింది.

ఇద్ద‌రు ప్రాణ స్నేహితులక‌థ‌తో తీసిన చిత్ర‌మిది. అర్జున్ (శర్వానంద్).. విజయ్ (సిద్దార్థ్) విశాఖపట్నంలో చిన్నప్పట్నుంచి కలిసి పెరిగిన ప్రాణ స్నేహితులు. అర్జున్ ఏదైనా వ్యాపారం చేసి జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఉంటే.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన విజయ్ కు మాత్రం ఎస్ఐ అవ్వాలన్న కోరికతో అడుగులేస్తుంటాడు. మహాలక్ష్మి (అదితి రావు హైదరి) అనే అమ్మాయితో విజయ్ ప్రేమలో ఉంటే.. శ్వేత (అను ఇమ్మాన్యుయెల్)తో అర్జున్ పరిచయం ప్రేమ దిశగా మారుతుంది. ఇలా వీళ్లిద్దరి జీవితాలు సాఫీగా సాగిపోతున్న టైంలో విశాఖపట్నాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్న స్మగ్లర్ ధనుంజయ్ (గరుడ రామ్).. విజయ్ కారణంగా తీవ్రంగా గాయపడతాడు. అతడు చనిపోయాడనుకుని భయంతో ఊరు విడిచి పారిపోతాడు విజయ్. కానీ తన వెంట మహాను పంపించడానికి అర్జున్ చేసిన ప్రయత్నం ఫలించదు. ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల్లో ధనుంజయ్.. అర్జున్ చేతుల్లో హతమవుతాడు. అర్జున్.. అతడి స్థానంలోకి వచ్చి వైజాగ్ కు డాన్ అవుతాడు. ఐతే కొన్నేళ్ల తర్వాత వైజాగ్ కు తిరిగొచ్చిన విజయ్.. అర్జున్ ను అపార్థం చేసుకుని అతడి కార్యకలాపాలకు అడ్డం పడతాడు. ఇంతకీ అన్నేళ్లు విజయ్ ఏమైపోయాడు.. అర్జున్ తో అతడి వైరం ఎక్కడిదాకా వెళ్లింది.. ఈ క్రమంలో మహా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ. కానీ క‌థ‌నంలో ఫెయిల్యూర్ మూవీ ప‌రాజయానికి కార‌ణమైంద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి.
Tags:    

Similar News