టాలీవుడ్ కి ఓటీటీ కొవిడ్ 19 భూతంలాంటిదా?

Update: 2020-03-30 00:30 GMT
ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని అల్ల క‌ల్లోలం చేస్తున్న కొవిడ్ 19 ఎన్నో పాఠాల్ని నేర్పిస్తోంది. క‌రోనా అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు టాలీవుడ్ నీ వ‌దిలిపెట్ట‌క అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. షూటింగులు బంద్.. థియేట‌ర్లు బంద్.. కార్మికుల ప‌ని బంద్.. తిండి తిప్ప‌లు బంద్! అన్నంత‌గా ఒణికించేస్తోంది. మ‌న సినిమా పెద్దలు అంతో ఇంతో మంచోళ్లు గ‌నుక కాస్త తిండి పొట్లాలు కార్మికులకు దొరుకుతున్నాయి కానీ.. ప‌రిస్థితి ఎలా ఉండేదో!

ఇక‌పోతే ప‌రిశ్ర‌మ‌లోకి క‌రోనా ప్ర‌వేశించక ముందే అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారిన మ‌హ‌మ్మారీగా గుర్తించ‌బ‌డిన‌ది ఏది? అంటే అది క‌చ్ఛితంగా డిజిట‌ల్ విప్ల‌వం అనే చెప్పాలి. ప్ర‌పంచం కుగ్రామంగా మారి స్మార్ట్ ఫోన్ లోకి ప్ర‌తిదీ అందుబాటులోకి వ‌చ్చేయ‌డంతో ఇక నిర్మాత‌ల‌కు అస‌లు టెన్ష‌న్లు మొద‌ల‌య్యాయి. భారీ హిట్టు అంటే త‌ప్ప థియేట‌ర్ల నుంచి తిరిగి పెట్టుబ‌డులు రాని ధైన్యం నెల‌కొంది ఇప్పుడు. ఇక ఇప్ప‌టికే ఓటీటీ వేదిక‌పై వెబ్ సిరీస్ లు.. కొత్త సినిమాలు వ‌చ్చేస్తుండ‌డంతో ఈ టెన్ష‌న్ ప‌దింత‌లైంది. ఒక ర‌కంగా టాలీవుడ్ కి ఇది క‌నిపించ‌ని కొవిడ్ వైర‌స్ లాంటిది. ఇది కూడా వైద్యానికి అంద‌ని వైర‌స్ లాంటిదేన‌న్న విశ్లేష‌ణ కొంద‌రిలో సాగుతోంది.

ఇక‌పోతే ఓటీటీ విస్త్ర‌తంగా అందుబాటులోకి వ‌చ్చేయ‌డంతో పొరుగు భాష‌ల్లో.. దేశ విదేశాల్లో రిలీజ‌వుతున్న ప్ర‌తి సినిమాని వీక్షించే వెసులుబాటు ఉంది. ఆ క్ర‌మంలోనే ఇరుగు పొరుగు భాష‌ల్లో హిట్ట‌యిన వాటిని రీమేక్ చేసే అవ‌కాశం వెసులుబాటు పెరిగాయి. దీంతో మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రీమేక్ ల‌పై ఆధార‌ప‌డుతున్నారు. అయితే ఇది మంచిదేనా? అంటే... స్మార్ట్ ఫోన్ లో పొరుగు సినిమాని చూస్తే అది గొప్ప‌గా అనిపించ‌వ‌చ్చు కానీ.. తీరా దానిని రీమేక్ చేసి  మ‌న ఆడియెన్ కి త‌గ్గ‌ట్టు అందివ్వ‌డంలో విఫ‌ల‌మైతేనే అస‌లు స‌మ‌స్య ఎదుర‌వుతోంది. మ‌న నేటివిటీ.. మ‌న క‌ల్చ‌ర్ .. మ‌న సెన్సిబిలిటీస్ ని ఈ రీమేక్ ల‌లో ప్ర‌తిబింబించ‌డంలో మెజారిటీ పార్ట్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫెయిల‌వుతున్నార‌న్న అంచ‌నా ఉంది. అందుకే ఇప్పుడు డిజిట‌ల్ కొన్ని కోణాల్లో కొవిడ్ 19 లాంటిదేన‌ని విశ్లేషిస్తున్నారు. మ‌న నిర్మాత‌లు ఒరిజిన‌ల్ క‌థ‌ల‌పై ఆధార‌ప‌డి వైర‌స్ ల‌ను వ‌దిలేయ‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న ఒక రీమేక్.. అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ ఉన్న మ‌రో రీమేక్ విష‌యంలో ఎలాంటి తప్పులు దొర్ల కుండా మ‌నదైన కంటెంట్ ని అందిస్తున్నారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News