ఇక ఆ సినిమాలన్నిటికి అదే దిక్కా?

Update: 2020-04-05 01:30 GMT
ఏమో అనుకున్నాం కాని కరోనా సినిమా ఇండస్ట్రీ పై పెను ప్రభావం చూపించబోతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలు త్వరలో ప్రారంభం అవ్వాల్సిన సినిమాలు ఇలా ప్రతి ఒక్క సినిమాపై కూడా కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం పడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎంతో మంది నిర్మాతలు ఆర్థికంగా ఇతర వ్యాపారాలపై ఆధారపడి ఉంటారు. వారు ఇప్పుడు సినిమాల నిర్మాణంను పూర్తి చేయడం కష్టమే అంటున్నారు. ఇక సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని సమ్మర్‌ రిలీజ్‌ కు సిద్దంగా ఉన్న సినిమాల పరిస్థితి ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

సమ్మర్‌ అయిన ఏప్రిల్‌ మే నెలల్లో చిన్నా పెద్ద కలిపి ఏకంగా రెండు డజన్ల వరకు విడుదల చేయాలని భావించారు. అయితే అందులో ఎక్కువ శాతం మద్యస్థ బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయి. ఇక కొన్ని సినిమాలు చిన్న బడ్జెట్‌ సినిమాలు కూడా ఉన్నాయి. చిన్న బడ్జెట్‌ సినిమాలు.. క్రేజ్‌ లేని సినిమాలు అసలు విడుదల అవ్వడమే కష్టంగా ఉంది. ఒక ప్రముఖ నిర్మాతగా అంచనా ప్రకారం ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రాబోయే రెండు మూడు నెలల్లో చాలా తక్కువ సినిమాలు విడుదల చేసుకుంటే బెటర్‌ అనే ఉద్దేశ్యంలో ఉన్నారట.

కరోనా ఇంకా ఏమైనా ఉందా అనే భయాందోళన తో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టక పోవచ్చు అని ఆ నిర్మాత అభిప్రాయం. అందుకే ఇప్పుడు ఏవైతే మీడియం బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయో.. ఏవైతే పెద్దగా జనాల్లో క్రేజ్‌ లేని సినిమాలు ఉన్నాయో వాటిని ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా విడుదల చేసుకోవాల్సి రావచ్చు అంటున్నారు. థియేటర్లలో ఈ సినిమాను డిస్టిబ్యూట్‌ లేదా ఎగ్జిబ్యూట్‌ చేసేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపించరు. అందుకే ఆ సినిమాలు ఓటీటీ ద్వారానే విడుదల చేయాల్సి రావచ్చు. లేదంటే సొంత రిస్క్‌ తో నిర్మాతలు ఆ సినిమాను విడుదల చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

ప్రేక్షకులు థియేటర్లకు రావడమే గగనంగా ఉన్న ఈ సమయంలో చిన్నా చితకా సినిమాలు థియేటర్లలో విడుదల చేయడం ఆత్మహత్య సదృశ్యం అవుతుందని ఒక డిస్ట్రిబ్యూటర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాబోయే ఆరు నెలలు లేదా సంవత్సరం పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News