పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న మన హీరోలు సక్సెస్ అయ్యేనా..?

Update: 2020-11-18 02:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా హీరోలు అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇమేజ్ తో సంబంధం లేకుండా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలపై ద్రుష్టి పెడుతున్నారు. తెలుగు హీరోల సినిమాలు హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు నార్త్ లో వచ్చిన క్రేజ్ ని తెలుగు హీరోలందరూ క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. కేవలం తెలుగు ప్రేక్ష‌కుల‌కే ప‌రిమిత‌మ‌వకుండా ఇత‌ర భాష‌ల్లోనూ పాపులారిటీ తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి'తో దేశ విదేశాల్లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే ప్రభాస్ ఆ ఇమేజ్ ని కాపాడుకుంటూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. 'సాహో' సినిమా దక్షిణాదిలో ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ బాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ 'రాధే శ్యామ్' మరియు 'ఆదిపురుష్' చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బాలీవుడ్ మార్కెట్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

నిజానికి రామ్ చరణ్ 'జంజీర్'(తుఫాన్) అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేశాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో బాలీవుడ్ వైపు మళ్ళీ కన్నెత్తి చూడని చరణ్.. చాలా గ్యాప్ తర్వాత 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెడుతున్నాడు. అలానే ఎన్టీఆర్ కూడా 'ఆర్.ఆర్.ఆర్' తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమాతో డార్లింగ్ ప్రభాస్ రేంజ్ మారిపోయినట్లే.. తారక్ - చరణ్ రేంజ్ కూడా 'ఆర్.ఆర్.ఆర్' తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని వారి అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

అలానే అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప' సినిమాని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు కొరటాల శివ తో చేయబోయే చిత్రాన్ని కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 'అల వైకుంఠపురంలో’ సినిమాతో వచ్చిన క్రేజ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాలని బన్నీ ట్రై చేస్తున్నాడు. ఇక సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించిన రానా దగ్గుబాటి 'బాహుబలి' తర్వాత ప్రతి సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

ఇక మంచు మనోజ్‌ కూడా కొంతకాలం గ్యాప్‌ తీసుకుని చేస్తున్న 'అహం బ్రహ్మస్మిః' చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా విడుదల చేస్తామని ప్రకటించారు. అలానే హీరో ఆది సాయి కుమార్‌ కూడా ఓ పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్ట్రెయిట్ హిందీ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ నటించిన చిత్రాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే రికార్డ్ స్థాయి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ డబ్బింగ్ సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ నటించిన 'ఛత్రపతి' సినిమాని హిందీలో శ్రీనివాస్ రీమేక్ చేయనున్నారట. అలానే రామ్ పోతినేని కూడా పాన్ ఇండియా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే పాన్ ఇండియా ఇమేజ్ కోసం పాకులాడుతున్న వీరందరూ ఎంత మేరకు సక్సెస్ అవుతారనేది ప్రశార్థకంగా మారింది. 'బాహుబలి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాని కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఉత్తరాదిన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అలానే ఇప్పుడు యూట్యూబ్ లో డబ్బింగ్ సినిమాలకు వచ్చే వ్యూస్ చూసి చాలా మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పులి ని నక్క వాత పెట్టుకున్నట్లు అనే విధంగా ఒక సినిమా వల్ల హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాడని ప్రతి ఒక్కరూ అదే ఇమేజ్ కోసం ట్రై చేస్తే అసలుకే మోసం వస్తుందని సినీ నిపుణులు చెబుతున్నాడు. మరి మన హీరోలు కంటెంట్‌ బావుంటే అది ఏ భాషలో తీసినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విషయాన్ని నిరూపించి అక్కడ కూడా సక్సెస్ అవుతారేమో చూడాలి.
Tags:    

Similar News