#ఆక్సిజ‌న్ సాయం.. ఆ మూడు జిల్లాల‌పై చిరు ప్ర‌త్యేక ఫోక‌స్

Update: 2021-05-26 07:40 GMT
కరోనా క్రైసిస్ కాలంలో మెగాస్టార్ చిరంజీవి సేవాకార్య‌క్ర‌మాల్ని విస్త‌రించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా బ్ల‌డ్ బ్యాంకుల త‌ర‌హాలోనే ఇప్పుడు అన్ని జిల్లాలోనూ ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. త‌న అభిమాన సంఘాల అధ్య‌క్షులే ఈ బ్యాంకుల్ని ఆయా జిల్లాల్లో నిర్వ‌హిస్తున్నారు. అత్య‌వ‌స‌రంలో ఉన్న క‌రోనా రోగుల్ని త‌క్ష‌ణం ఆదుకునేందుకు ఆస్ప‌త్రుల‌తో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా దారుల‌తో సంబంధాల్ని కొన‌సాగిస్తూ ఆదుకునే ప్ర‌య‌త్న‌మిది. దీనికోసం హైద‌రాబాద్ బ్ల‌డ్ బ్యాంక్ నుంచి తొలి విడ‌త ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు.. కాన్ స‌న్ ట్రేట‌ర్ల‌ను మెగాస్టార్ పంపించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ ఆక్సిజన్ బ్యాంకుల‌ పనుల్ని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వీటి ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు గుంటూరు-శ్రీ‌కాకుళం-విశాఖ‌ప‌ట్నం-విజ‌య‌న‌గ‌రం జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరులో క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ఆక్సిజన్ కొర‌త తీవ్రంగా ఉంద‌ని అందువ‌ల్ల తాము చైనా నుంచి కొన్ని ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు కాన్ స‌న్ ట్రేట‌ర్ల‌ను ఆర్డ‌ర్ చేశామ‌ని చిరు ఇంత‌కుముందు వెల్ల‌డించారు. తెలుగు రాష్ట్రాలు స‌హా క‌ర్నాట‌క‌లోనూ అభిమానులు ఆక్సిజ‌న్ సేవ‌ల్ని చేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో మెగా అభిమానులు కూడ విరాళాలు అందించ‌నున్నారు. ప్ర‌స్తుత కొర‌త స‌మ‌యంలో ఆక్సిజ‌న్ స‌ద్వినియోగం కావాల‌ని వృధా కాకుండా జాగ్ర‌త్త ప‌డేందుకు మానిట‌రింగ్ వ్య‌వ‌స్థ ఉంటుంద‌ని చిరు తెలిపారు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల ఏర్పాటుతో పాటు రీఫిల్లింగ్ పైనా దృష్టి సారిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ క‌ష్ట కాలంలో చిరు సాయానికి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు.




Tags:    

Similar News