బ్రహ్మి పేరును విశాల్ వాడేసుకున్నాడు

Update: 2015-08-08 10:17 GMT
ఏడేళ్ల కిందటి వరకు జయసూర్య అనగానే మనకు శ్రీలంక విధ్వంసక బ్యాట్స్ మెనే గుర్తుకొచ్చేవాడు. కానీ కింగ్ సినిమా చూశాక మాత్రం జయసూర్య అనే పేరెత్తగానే ఆటోమేటిగ్గా బ్రహ్మానందం గుర్తుకొచ్చేయడం.. మన పెదాలపై చిరునవ్వు పులుముకోవడం కామనైపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య పాత్రలో ఆ రేంజి లో చెలరేగిపోయాడు బ్రహ్మి. ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుంచుకునే క్యారెక్టర్ల లో ఇదొకటనడంలో సందేహం లేదు. ఐతే బ్రహ్మి కామెడీగా మార్చేసిన పేరును.. ఒక మాస్ హీరో తన సినిమాకు వాడుకోబోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగువాడైన తమిళ హీరో విశాల్ తన తర్వాతి సినిమాకు ‘జయసూర్య’ అని టైటిల్ పెట్టాడు.

ఐతే ఈ టైటిల్ తెలుగు వరకే. తమిళంలో ‘పాయుం  పులి’ అనేది టైటిట్. ఐతే తెలుగులో ఏం టైటిల్ పెడదామా అని ఆలోచించి హీరో క్యారెక్టర్ పేరైన ‘జయసూర్య’నే ఖరారు చేశారు. ఐతే ఈ టైటిల్ తెలుగు వాళ్లకు కామెడీగా అనిపిస్తుందన్న సంగతి విశాల్ కు ఎవరూ చెప్పలేదేమో. ఇంతకుముందు విశాల్ తో పాండియనాడు (తెలుగులో పల్నాడు) లాంటి పెద్ద హిట్  తీసిన సుశీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విశాల్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తుండటం విశేషం. సెప్టెంబరు 4న తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి సినిమా విడుదల చేయబోతున్నారు. చాన్నాళ్లుగా విశాల్ సినిమాలు తెలుగులో సరిగా ఆడట్లేదు. ఐతే ‘రుద్రమదేవి’ లాంటి పెద్ద సినిమాను ఢీకొట్టబోతున్న ‘జయసూర్య’తో ఎలాంటి ఫలితం రాబడతాడో చూడాలి.
Tags:    

Similar News