చంపడంలో మాస్టర్స్ చేశా.. 'డాకు మహారాజ్' పవర్‌ఫుల్ రిలీజ్ ట్రైలర్..!
బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ''డాకు మహారాజ్''.
బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ''డాకు మహారాజ్''. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బయటకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చింది. అలానే ఇటీవల వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
ఒంటి మీద పదహారు కత్తిపోట్లు, ఒక బులెట్ గాయం ఉన్నాసరే, కింద పడకుండా అంతమందిని నరికాడంటే అతను మనిషి కాదు.. వైల్డ్ యానిమల్ అంటూ బాలయ్య పాత్రకు ఎలివేషన్ ఇవ్వడంతో 'డాకు మహారాజ్' ట్రైలర్ ప్రారంభమవుతుంది. బాలకృష్ణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆయన నోట నుంచి ఎలాంటి మాస్ డైలాగ్స్ పలికించకుండా మొదటి ట్రైలర్ ను కట్ చేయగా.. ఇప్పుడు లేటెస్ట్ ట్రైలర్ లో ''రాయలసీమ నా అడ్డా'' అంటూ కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పించారు. ''ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో.. నేను చంపడంలో చేశా'' అంటూ బోయపాటి శ్రీను సినిమాల స్టైల్ లో తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి బాలకృష్ణ పేల్చిన డైలాగ్ ఆకట్టుకుంది.
'డాకు మహారాజ్' నుంచి ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో అసలు కథేంటనేది రివీల్ చేయకుండా మేకర్స్ క్యూరియాసిటీ పెంచారు. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ ను కూడా దర్శకుడు బాబీ అలానే కట్ చేసారు. దీంతో బాలకృష్ణ మాస్ ను హైలైట్ చేసే ప్రయత్నం చేసారు. రాయలసీమ నేపథ్యం, మైనింగ్ మాఫియా, బందిపోట్లు, అడవుల్లో క్రూర మృగాలు, మృగాల్లాంటి రౌడీలను వేటాడే హీరో, ఫ్యామిలీ ఎమోషన్స్, హై వోల్టేజ్ యాక్షన్.. ఇలా చాలా అంశాలను టచ్ చేస్తూ ఏదో పెద్ద కథనే చెప్పబోతున్నట్లుగా ట్రయిలర్ లోనే హింట్ ఇచ్చారు.
బాలకృష్ణ భిన్నమైన గెటప్స్ లో, సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నారు. గొడ్డలితో సిగరెట్ వెలిగించుకునే షాట్, సైకిల్ తొక్కుకుంటూ వచ్చే సన్నివేశం, గుర్రం మీద చేసే ఫైట్ సీన్ వంటివి నందమూరి ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా,షైన్ టామ్ చాకో సహా పలువురు మెయిన్ క్యారెక్టర్స్ కు ఈ ట్రైలర్ లో చోటిచ్చారు. 'మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండలనే బాంబులతో లేపేస్తాం' అంటూ స్టైలిష్ విలన్ గా బాబీ డియోల్ ఓ డైలాగ్ కూడా చెప్పారు. ''నువ్వు అరిస్తే బార్కింగ్.. నేను అరిస్తే..'' అంటూ బాలయ్య సింహ గర్జన చేయడంతో ట్రెయిలర్ ముగిసింది.
ఓవరాల్ గా 'డాకు మహారాజ్' ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా ఉంది. విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఎప్పటిలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం సమకూర్చగా.. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. 'అఖండ' 'వీర సింహా రెడ్డి' 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ ఫార్మ్ లో ఉన్న బాలకృష్ణ.. ఈసారి పొంగల్ కి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.