మూవీ రివ్యూ : పలాస 1978

Update: 2020-03-06 14:35 GMT
చిత్రం : పలాస 1978

నటీనటులు: రక్షిత్-నక్షత్ర్ర-తిరువీర్-రఘు కుంచె-జనార్దన్ తదితరులు
సంగీతం: రఘు కుంచె
ఛాయాగ్రహణం: విన్సెంట్ అరుల్
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
రచన-దర్శకత్వం: కరుణ కుమార్



పలాస 1978.. కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశమవుతున్న సినిమా. ఈ సినిమా చూసి సెలబ్రెటీలందరూ అద్భుతం అన్నారు. ‘లండన్ బాబులు’ ఫేమ్ రక్షిత్ హీరోగా కరుణ కుమార్ అనే కొత్త దర్శకుడు కరుణ కుమార్ రూపొందించిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఇండస్ట్రీ జనాలు చెప్పిన స్థాయిలో సినిమా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ: మోహన్ రావు (రక్షిత్) శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఓ వెనుకబడ్డ తరగతికి చెందిన కుర్రాడు. అతను యుక్త వయసు నుంచి అగ్ర వర్ణాల ఆధిపత్యం చూసి రగిలిపోతుంటాడు. ఒక దశలో తన అన్నకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఊరి షావుకారు కొడుకును కొడతాడు. దీంతో షావుకారు అతడిని మట్టుపెట్టాలని చూస్తాడు. దీంతో గొడవ పెద్దదవుతుంది. కొన్ని పరిణామాల అనంతరం మోహన్ రావు గూండాగా తయారవుతాడు. అందులోకి దిగాక ప్రతి రోజూ అతడికి జీవన్మరణ సమస్యే. ఈ గూండాగిరీ వల్ల అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. ఎవరిని కోల్పోయాడు.. ఆ నష్టానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ: అప్పుడెప్పుడో వచ్చిన ‘అంత:పురం’ను మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కక్షలు కార్పణ్యాల మీద రియలిస్టిగ్గా సాగిన తెలుగు సినిమాలు అరుదు. తమిళం నుంచి వచ్చిన ‘అనంతపురం’ లాంటి సినిమాలు మంచి ఆదరణ పొందినా మనవాళ్లు ఆ తరహా ప్రయత్నాలు చేయలేదు. ఈ మధ్యే ‘అసురన్’ పేరుతో తమిళంలో ఇలాంటి మరో సినిమా వచ్చింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పలాస 1978’ కూడా అచ్చంగా అలాంటి సినిమానే. కొన్ని దశాబ్దాల కిందట అగ్ర వర్ణాల ఆధిపత్యానికి బలైన ఓ కుటుంబం కథే ఇది.

ఏమాత్రం రాజీ లేకుండా.. కమర్షియల్ హంగులని పక్క దారి పట్టకుండా కొత్త దర్శకుడు కరుణ కుమార్ ఒక కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు. తెలుగు సినిమాల్లో పెద్దగా వినిపించని శ్రీకాకుళం యాసను, అంతగా కనిపించని అక్కడి సంస్కృతిని.. వాళ్ల జీవన శైలిని తొలిసారి అథెంటిగ్గా తెరపైకి తేవడం ఈ చిత్రంలోని అతి పెద్ద విశేషం. కాకపోతే దర్శకుడు సిన్సియర్ గా ఓ కథను చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ కథలో కొత్తదనం లేకపోవడం, అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే స్థాయిలో సినిమా జనరంజకంగా తెరకెక్కపోవడం ఇందులోని ప్రతికూలతలు. ఓ వర్గం ప్రేక్షకులకు అమితంగా నచ్చుతూనే.. అందరి ఆమోదం పొందలేని బలహీనత ‘పలాస 1978’ది.

పైన చెప్పుకున్న అంత:పురం.. అనంతపురం.. అసురన్.. వీటన్నింటిలోనూ కథలో ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉంటుంది. రస్టిగ్గా.. రియలిస్టిగ్గా కథను నడిపించడంలో వాటికి దీటుగా ‘పలాస’ నిలిచినప్పటికీ.. వాటిలోని కొత్తదనం, ఉత్కంఠ ఇందులో మిస్సయ్యాయి. ఒక దశ వరకు కొంత ఎగ్జైటింగ్ గానే నడిచినప్పటికీ.. ఆ తర్వాత ఫ్లాట్ గా సాగిపోయే కథాకథనాలు ప్రేక్షకుల్లో నైరాశ్యాన్ని నింపుతాయి. ఊరిని భయపెట్టే రౌడీ దగ్గరికి అతను తప్ప వేరెవ్వరూ ఎత్తలేరని పేరున్న గుండును తీసుకెళ్లి మట్టుపెట్టే సన్నివేశం తరహావి ఇంకొన్ని సినిమాలో పడి ఉంటే.. దీని రీచ్ పెద్దగా ఉండేది.

నాలుగు దశాబ్దాల కిందట శ్రీకాకుళం పరిస్థితులు.. అగ్ర, పేద వర్ణాల మధ్య అంతరం ఎలా ఉండేవో.. కేవలం తమ అవసరాల కోసం కింది స్థాయి కులస్థుల్ని వాడుకుని వాళ్లలో వాళ్లకు చిచ్చు పెట్టి అగ్ర వర్ణాల వాళ్లు ఎలా తమ పబ్బం గడుపుకునేవారో చాలా కూలంకషంగా చర్చించాడు దర్శకుడు కరుణ కుమార్. ఒక సన్నివేశంలో హీరో అన్నను మభ్యపెట్టి విలన్ అతడిని వశపరుచుకునే సన్నివేశంలో సింబాలిగ్గా అదేఇంట్లో కుక్క అన్నం తింటున్న దృశ్యాన్ని చూపించడం దర్శకుడి పరిణతిని తెలియజేస్తుంది. నాలుగు దశాబ్దాల కిందట పలాస ప్రాంతంలో మనుషులు.. వాతావరణం.. వాళ్ల ప్రవర్తన.. మాటలు.. వాళ్ల పాటలు.. జానపదాల్ని అథెంటిగ్గా తెరమీదికి తీసుకొచ్చిన వైనానికి ఆ ప్రాంత వాసులే కాదు.. ఇతరులు కూడా కచ్చితంగా ముగ్ధులవుతారు.

ఐతే దర్శకుడు నేటివిటీని తెరపైకి తేవడంలో పడ్డ కష్టాన్ని కథను తీర్చిదిద్దుకోవడంలోనూ చూపించి ఉంటే ‘పలాస’ ఒక క్లాసిక్‌గా నిలిచేది. ఇప్పటికీ క్లాసిక్ టచ్ కనిపించినప్పటికీ.. కథ పరంగా ఎగ్జైట్మెంట్ లేకపోవడం, ద్వితీయార్ధంలో అసలే మలుపులూ లేకుండా.. కొంతమేర ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా కథనం నడవడంతో సినిమా గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. ఒక మామూలు వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి స్పందించే క్రమంలో ఎలా ఊబిలో కూరుకుపోతాడో తెలియజెప్పే కథలు తెలుగు తెరపై చాలానే చూశాం. ఐతే ఆ కథను శ్రీకాకుళం నేటివిటీతో చెప్పడం ‘పలాస 1978’ ప్రత్యేకత. ఈ తరహా నరేషన్లో ఉన్న సొగసును ఆస్వాదించే వాళ్లకు.. రియలిస్టిక్ రూరల్ డ్రామాల్ని ఇష్టపడేవాళ్లకు ‘పలాస’ నచ్చుతుంది. మిగతా వాళ్ల సంగతి చెప్పలేం.


నటీనటులు: రక్షిత్‌ ఛాలెంజింగ్ క్యారెక్టర్లో ఓకే అనిపించాడు. కొత్తవాడైనప్పటికీ మోహన్ రావు పాత్రలో జీవించే ప్రయత్నం చేశాడు. అతను ప్రేక్షకులకు అలవాటు లేకపోవడం సమస్యే. హీరో అన్న పాత్రలో చేసిన ‘జార్జి రెడ్డి’ ఫేమ్ తిరువీర్ అదరగొట్టాడు. అతడి కళ్లల్లోని ఇంటెన్సిటీ పలు చోట్ల ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. హీరోయిన్ నక్షత్ర బాగా చేసింది. తన సహజమైన అందంతో.. కళ్లతో ఆకట్టుకుంది. విలన్ పాత్రలో రఘు కుంచె అదరగొట్టేశాడు. అతడి టాలెంటుని టాలీవుడ్ వాడుకోవాల్సిందే. రఘు అన్న పాత్రలో చేసిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు. హీరో స్నేహితుడి పాత్రలో చేసిన నటుడు జీవించేశాడు. మిగతా పాత్రధారులూ ఓకే.


సాంకేతిక వర్గం: రఘు కుంచె సంగీత దర్శకుడిగానూ తన పనితనం చూపించాడు. శ్రీకాకుళం నేటివిటీకి అద్దం పట్టే పాత కాలం నాటి జానపదాలు.. సినిమా మూడ్ కు తగ్గ నేపథ్య సంగీతంతో అతను ఆకట్టుకున్నాడు. ఒకప్పటి శ్రీకాకుళం వాతావరణం చూపించంలో విన్సెంట్ అరుల్ ఛాయాగ్రహణం.. ఆర్ట్ డైరెక్టర్ పనితనం మెప్పిస్తాయి. నిర్మాతను కూడా అభినందించాల్సిందే. దర్శకుడు కరుణ కుమార్ తొలి ప్రయత్నంలో ‘పలాస’ లాంటి సినిమాను ఎంచుకోవడం గొప్ప విషయమే. నేటివిటీపై అతడి పట్టు.. డీటైలింగ్ ఆకట్టుకుంటాయి. సన్నివేశాల్ని ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో అతడి ప్రతిభ కూడా మెప్పిస్తుంది. కానీ కథాకథనాల విషయంలో అతను మరింత కసరత్తు చేయాల్సింది.


చివరగా: పలాస 1978.. మంచి ప్రయత్నమే కానీ

రేటింగ్- 2.5/5



Tags:    

Similar News