స్పెష‌ల్ స్టోరీ : ఈగో చెప్పిన పాన్ ఇండియా క‌థ

Update: 2022-05-04 11:17 GMT
ఈగో చాలా ప‌వ‌ర్ ఫుల్‌. అది ఒక్క‌సారి హ‌ర్ట‌యిందా అన‌ర్ధాలు.. అద్భుతాలు జరిగిన సంద‌ర్భాలు చాలానే వున్నాయి. మ‌య స‌భ‌లో ద్రౌప‌ది ప‌క్కున న‌వ్వింద‌ని దుర్యోధ‌నుడి ఈగో హ‌ర్ట్ అయింది. నిండు కురు స‌భ‌లో త‌న‌ని వివ‌స్త్రని చేశార‌ని ద్రౌప‌ది ఈగో హ‌ర్ట్ అయి మ‌హాభార‌త యుద్దానికే దారితీసింది. ఇక ట్రైన్ నుంచి దించేశార‌ని మ‌హాత్మాగాంధీ ఈగో దెబ్బ‌తింది దాని ఫ‌లితం సూర్యుడు హ‌స్త‌మించ‌ని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాగించి దేశం నుంచి యావ‌త్ భార‌తం త‌రిమికొట్టి స్వాతంత్య్రాన్ని సాధించింది. దుబాయ్ పెట్రోల్ బంకులో ప‌ని చేసిన ధీరూభాయ్ అంబానీ ఈగో హ‌ర్ట్ అయి వేల కోట్ల రిల‌య‌న్స్ సామ్రాజ్యాన్ని సృష్టించింది.

తెలుగు వాడికి విలువ లేద‌ని ఈగో హ‌ర్ట్ అవ‌డంతో పంతం ప‌ట్టి తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెల‌ల్లోనే ఎన్టీరామారావు అధికారంలోకి రావాల్సి వ‌చ్చింది. ఇదే త‌ర‌మాలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఈగో హ‌ర్ట్ కావ‌డంతో గులాబీ పార్టీని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వివిధ రంగాల వారి ఈగో ఇలాంటి అద్భుతాలు.. అసాధ్యాల‌ని సుసాధ్యం చేస్తే ద‌క్షిణాది క్రేజీ స్టార్ల ఈగో ఏకంగా పాన్ ఇండియా క‌థ‌నే చెప్పింది. ద‌క్షిణాదిలో పాన్ ఇండియా చిత్రాల‌కు కేంద్ర మిందువుగా మారింది. `స్టూడెంట్ నెం.1` సినిమాతో సీరియ‌ల్ ద‌ర్శ‌కుడి స్థాయి నుంచి సినీ ద‌ర్శ‌కుడిగా మారారు రాజ‌మౌళి.

ఈ మూవీ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. హీరోని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు, క‌థ‌, క‌థ‌నాల‌ని న‌డిపించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. కానీ దీనికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళినే అయినా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేసింది మాత్రం ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. దీంతో రాజ‌మౌళికి ద‌క్కిన‌ క్రెడిట్ అంతంత మాత్ర‌మే. ఇక మూవీ ఈవెంట్ లలోనూ పాల్గొన్నా ఆయ‌న ప్ర‌ధాన్య‌త పెద్ద‌గా ల‌భించ‌లేదు. ఆ త‌రువాత `సింహాద్రి`తో త‌నేంటో నిరూపించుకున్నారు. ద‌ర్శ‌కుడిగా గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఇక ఇంత‌కు మించిన గుర్తింపు కోసం ఆయ‌న చేసి చిత్రం `మ‌గ‌ధీర‌`. ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలో త‌న టీమ్ కి టికెట్లు కూడా ఇవ్వ‌లేద‌ని హ‌ర్ట్ అయ్యారు రాజ‌మౌళి. ఆ ఈగోనే `బాహుబ‌లి`కి అంకురార్ప‌ణకు దారితీసింది.

ఆత‌రువాత ఏం జ‌రిగిందో తెలిసిందే. ప్ర‌భాస్ - రానాల‌తో ద‌క్షిణాదిలో క‌నీవినీ ఎరుగ‌ని బ‌డ్జెట్ తో అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ చిత్రం ఒక్క‌సారిగా భార‌తీయ సినిమా టాలీవుడ్ వండ ఆశ్చ‌ర్యంగా చూసేలా చేసింది. ఆ త‌రువాత చేసిన `బాహుబ‌లి 2` భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాధ్యాయానికి శ్రీ‌కారం చుట్టింది. రాజ‌మౌళిని పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా నిల‌బెట్టి తిరుగులేని ద‌ర్శ‌కుడిగా దేశం మొత్తం కీర్తించేలా చేసింది. ఈ రెండు సీరీస్ ల‌లో `బాహుబ‌లి 2` దాదాపు రెండు వేల కోట్ల మార్కు వ‌ర‌కు వెళ్లి తెలుగు సినిమా గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసింది.
 
రాజ‌మౌళి త‌రుహాలో ఈగో హ‌ర్ట్ అయి పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు ప్ర‌శాంత్ నీల్, హీరో రాకింగ్ స్టార్ య‌ష్‌. ద‌ర్శ‌కుడిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలో రొటీన్ క‌థ రాసుకున్న ప్ర‌శాంత్ నీల్ దాన్ని చాలా మంది క‌న్న‌డ హీరోల‌కు వినిపించార‌ట‌. ఏ ఒక్క‌రు కూడా సినిమా చేయ‌డానికి ముందుకు రాక‌పోగా రొటిన్ యాక్ష‌న్ క‌థ ప‌ట్టుకుని ఎన్ని రోజులు తిరిగినా డైరెక్ట‌ర్ వి కాలేవ‌న్నార‌ట‌. ఆ పంతంతో త‌న బావ శ్రీ‌ముర‌ళినే హీరోగా పెట్టి `ఉగ్రం` చేశాడు. అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ప్ర‌శాంత్ నీల్ పేరు క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో వినిపించ‌డం మొద‌లు పెట్టింది. అయితే ఇది కాదు.. ఇంత‌కు మించిన రేంజ్ లో భారీ స్థాయిలో హిట్ ని సొంతం చేసుకోవాల‌ని `కేజీఎఫ్‌`ని తెర‌పైకి తీసుకొచ్చార‌ట‌.

భారీ బ‌డ్జెట్.. ద‌ర్శ‌కుడికి రెండ‌వ సినిమా అని చాలా మంది చాలా ర‌కాలుగా ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ ప‌ట్టించుకోలేద‌ట‌. ప్ర‌శాంత్ నీల్ విజ‌న్ పై న‌మ్మ‌కంతో ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్న య‌ష్ తో సినిమాని ప‌ట్టాలెక్కించార‌ట‌. చాప్ట‌ర్ 1 సంచ‌ల‌నం సాధించింది. ప్ర‌శాంత్ నీల్ ఈగో సంతృప్తి చెందే స్థాయిలో అత‌నికి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా నిల‌బెట్టింది. చాప్టర్ 2 అంత‌కు మించి అన్న‌ట్టుగా 1000 కోట్ల క్ల‌బ్ లో చేర‌డంతో త‌న పారితోషికాన్ని 25 కోట్ల నుంచి 50 కోట్ల‌కు పెంచేసి ఇప్ప‌డు ద‌క్షిణాదిలో రాజ‌మౌళి త‌రువాత హాట్ టాపిక్ గా మారాడు.

కేజీఎఫ్ హీరో య‌ష్ కెరీర్ వెన‌క కూడా ఈగో స్టోరీ వుంది. స్కూల్ డేస్ లో అంతా భ‌విష్య‌త్తులో మీరు ఏమ‌వుదామ‌ని అనుకుంటున్నార‌ని టీచ‌ర్ అడిగితే కొంత మంది టీజ‌ర్‌, డాక్ట‌ర్, లాయ‌ర్, ఇంజినీర్ అని చెబుతుంటే య‌స్ మాత్రం తాను స్టార్ హీరోని అవుతాన‌ని చెప్పార‌ట‌. అది విన్నా వాళ్లంతా ఘొల్లున న‌వ్వార‌ట‌. ఆ అవ‌మానంతో య‌ష్ ఈగో హ‌ర్ట్ అయింది. దాంతో పంతం ప‌ట్టిన య‌ష్ ఫైన‌ల్ గా `కేజీఎఫ్`తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి తొలి పాన్ ఇండియా స్టార్ గా రికార్డుని సొంతం చేసుకున్నారు.  

ఇక సుకుమార్ `పుష్ప‌` వెన‌క కూడా ఈగో విక‌టాట్ట‌హాసం చేసింది. ముందు ఈ సినిమాని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయాల‌ని సుకుమార్ ప్లాన్ చేసుకున్నారు. క‌థ అంతా రెడీ అయిన త‌రువాత మ‌హేష్ టైమ్ ఇవ్వ‌డంతో క‌థ నెరేట్ చేశారు. ఫైన‌ల్ గా స్టోరీ విన్న త‌రువాత మ‌హేష్ ఇంత రఫ్, మాసీవ్ పాత్ర‌, లుంగీ.. లేబ‌ర్ త‌ర‌హా పాత్ర చేయ‌డం నా వ‌ల్ల కాదు. చేయాలంటే చాలా మార్చాలి అని కండీష‌న్స్ పెట్టార‌ట‌. దీంతో ఈగో హ‌ర్ట్ అయిన సుకుమార్ అదే క‌థ‌ని అల్లు అర్జున్ కి వినిపించ‌డంతో సింగిల్ సిట్టింగ్ లోనే క‌థ ఓకే అయిపోయింది.

ఆ త‌రువాత ఈ మూవీ ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో బాలీవుడ్ ట్రేడ్ తో పాటు బాలీవుడ్ స్టార్ల‌కు, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నైట్ మేర్ గా ఎలా మారిందో తెలిసిందే. ఈగో హ‌ర్ట్ కావ‌డంతో మ‌హేష్ ని కాద‌ని బ‌న్నీ ద‌గ్గ‌రికి వెళ్లిన సుకుమార్ ని `పుష్ప‌` అనూహ్యంగా పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా మారిస్తే బ‌న్నీ ఊహించ‌ని విధంగా పాన్ ఇండియా స్టార్ ని చేసింది. వ‌సూళ్ల ప‌రంగానూ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అందుకే ఎవ‌రి ఈగోని హ‌ర్ట్ చేయ‌కూడ‌ద‌ని అంటారు. హ‌ర్ట్ చేస్తే ఫ‌లితాలు ఇలాగే వుంటాయి మ‌రి.

                                                                                                                                                                                                                                  - ర‌వి గోరంట్ల‌
Tags:    

Similar News