'పాపతో పైలం'.. మాస్ ఐటమ్ సాంగ్ తో మొదలైన మ్యూజికల్ 'హంట్'..!

Update: 2022-10-11 05:37 GMT
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ ''హంట్''. 'గన్స్ డోన్ట్ లై' అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అతను యాక్షన్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో 'ప్రేమిస్తే' భరత్ - సీనియర్ నటుడు శ్రీకాంత్ మేకా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'హంట్' ప్రచార చిత్రాలు మరియు టీజర్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలోని 'పాపతో పైలం' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోని లాంచ్ చేయడంతో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

'పాపతో పైలం' అనేది ఎనర్జిటిక్ ఐటమ్ నంబర్ అని చెప్పాలి. ఇందులో క్రాక్ బ్యూటీ అప్సర రాణి ఐటమ్ భామగా ఆడిపాడింది. సుధీర్ బాబుతో పాటుగా శ్రీకాంత్ మరియు భరత్ కూడా ఈ పాటలో కనిపించారు.

మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఎనర్జిటిక్ కంపోజిషన్ లో వచ్చిన ఈ డ్యాన్స్ నంబర్ మాస్ ని బాగా ఆకట్టుకుంటోంది. సింగర్స్ మంగిలి మరియు నకాష్ అజీజ్ తమదైన శైలిలో హుషారుగా ఆలపించారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు.

స్పెషల్ సెట్ లో షూట్ చేసిన ఈ పార్టీ సాంగ్ లో సుధీర్ మరియు అప్సర తమ స్టెప్పులతో డ్యాన్స్ ఫ్లోర్‌ ను కదిలించారు. భరత్ - శ్రీకాంత్ కూడా వీరికి సహకారం అందించారు. తన హాట్ హాట్ డ్యాన్సులతో భూమ్ బద్దల్ కొట్టే అప్సర.. ఈసారి పటాకా సాంగ్ లో మాస్ స్టెప్స్ తో వేట సాగించింది.

''హంట్'' చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తుండగా.. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్ గా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

ఇకపోతే 'ముంబై పోలీస్' అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా ''హంట్'' తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. 2013 లో పృథ్వీరాజ్ సుకుమారన్ - రెహమాన్ - జయసూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే చిత్రాన్ని సుధీర్ బాబు - శ్రీకాంత్ - భరత్ లతో రీమేక్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

'హంట్' మేకర్స్ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. టీజర్ ని బట్టి చూస్తే నిజమే అనిపిస్తోంది. ఇటీవల కాలంలో మలయాళ రీమేక్స్ తెలుగులో బాగానే వర్కవుట్ అవుతున్నాయి. మన నేటివిటీ మరియు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి హిట్టు కొడుతున్నారు.

'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగుకు తగ్గట్టుగా తీసి డైరెక్టర్ చందూ మొండేటి సూపర్ హిట్ అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతో 'భీమ్లా నాయక్' సినిమాని తెరకెక్కించి సాగర్ కె చంద్ర పర్వాలేదనిపించాడు. లేటెస్టుగా వచ్చిన 'గాడ్ ఫాదర్' సినిమా కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దర్శకుడు మోహన్ రాజా చేసిన చేంజెస్ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.

సుధీర్ బాబు ''హంట్'' సినిమా కూడా మలయాళ రీమేక్ అయితే.. తెలుగుకు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఒరిజినల్ లో లేని విధంగా 'పాపతో పైలం' వంటి మాస్ ని ఆకట్టుకునే డ్యాన్స్ నంబర్ ని పెట్టారు. మరి త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View

Tags:    

Similar News