చిరు.. బాలయ్యలకు ఆయన వద్దన్నా చేసి దెబ్బ పడ్డారట

Update: 2022-05-10 04:49 GMT
ఇప్పుడు పెద్ద వాళ్లు అయిపోయారు కానీ..టాలీవుడ్ లో తిరుగులేని రైటర్స్ గా తమ హవాను నడిపించారు పరుచూరి బ్రదర్స్. స్టార్ హీరోలు సైతం వారి సలహాల్ని తూచా తప్పకుండా పాటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అనుభవం నేర్పిన పాఠాలతో పాటు.. సినిమాల మీద వారికున్న పట్టు.. స్టార్ రైటర్స్ గా వారికున్న పేరు ప్రఖ్యాతులు అన్నిఇన్ని కావు. వయసు మీద పడిపోయిన వేళ.. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. ఇప్పటికి సినిమాలకు సంబంధించిన అంశాలపై వారికున్న పట్టు చూసినప్పుడు ముచ్చట వేస్తుంది. పరుచూరి పాఠాలు పేరుతో ఆయన సినిమాల గురించి చెబుతూ.. తమ అనుభవ పాఠాల్ని ప్రేక్షకులకు అందిస్తున్న వైనం తెలిసిందే.

తాజాగా హీరోల బాడీ లాంగ్వేజ్ లు.. అందుకు సరిపోయే కథల గురించి ఆయన మాట్లాడారు. ఎంత స్టార్ హీరోలు అయినప్పటికీ తమ బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే పాత్రల్నే చేయాలి తప్పించి.. అందుకు భిన్నంగా వెళితే చేదు అనుభవం తప్పదన్నారు.ఈ విషయంలో తాను అప్పట్లో ఇద్దరు స్టార్ హీరోలకు చెప్పిన సలహాలు.. సూచనల్ని వారు పట్టించుకోలేదని.. ఆ తర్వాత ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫట్ అన్నాయన్న విషయాన్ని చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా చిరు బాడీ లాంగ్వేజ్ కు సూట్ కాదని తాను చెప్పానని.. చిరు లాంటి ఫైరింగ్ పర్సనాలిటీ వెండి తెర మీద శాంతి ప్రవచనాలు చెబితే ప్రేక్షకులకు పెద్దగా   ఎక్కదని తాను చెప్పిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని అప్పట్లో చిరంజీవికి చెబితే.. ‘మీరు రెబల్ కాబట్టి మీకు పెద్దగా నచ్చదులెండి’ అని చెప్పి చేశారని.. ఆ సినిమా ఫలితం గురించి అందరికి తెలిసిందేనన్నారు.

తాము అలా చెప్పటానికి కారణం లేకపోలేదని.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు సినిమాలో ఎన్టీఆర్ ఇలానే శాంతి వచనాలు చెబితే ఆ సినిమా పోయిందన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరు లాంటి మెగా హీరోకు ఉన్న అభిమానులు తమ హీరో తమను ఎంటర్ టైన్ చేయాలని కోరుకుంటారన్నారు. బాలయ్య విషయంలోనూ అలానే జరిగిందని.. ఆ ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. ‘అల్లరి పిడుగు’ సినిమాను బాలక్రిష్ణ చేసే సమయంలో.. అందులోని తండ్రి పాత్రను కూడా ఆయన్నే చేయమని చెప్పామని కానీ ఆయన ఒప్పుకోలేదన్నారు.

తెలుగు ఆడియన్స్ కు ఏ మాత్రం పరిచయం లేని ఒక వ్యక్తి ముంబయి నుంచి వచ్చిన బాలయ్య తండ్రి పాత్రను పోషిస్తే.. ఆ పాత్రకు బాలయ్య భయపడుతుంటే జనానికి నచ్చదని.. అందుకే ఆ పాత్రకు బాలయ్యను ద్విపాత్రాభినయం చేయమని చెప్పానన్నారు. కానీ.. తన మాటల్ని ఆ మూవీ డైరెక్టర్.. నిర్మాత ఒప్పుకోలేదని.. ఆ సినిమా దెబ్బ తిన్న వైనాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో పెద్దన్నయ్యలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తే ప్రేక్షకులు ఓకే చేశారని.. అందరికి నచ్చిన విషయాన్ని చెప్పి.. బాడీ లాంగ్వేజ్ ఆధారంగా హీరోలు తాము చేయబోయే పాత్రల్ని చూడాలని.. అందుకు విరుద్దంగా చేసే సినిమాలు దెబ్బ తినటం ఖాయమని చెప్పుకొచ్చారు. పరుచూరి వారి మాటల్లో వాస్తవం ఎంతన్నది ఆయన చెప్పిన ఉదాహరణలే చెప్పేస్తున్నాయని చెప్పకతప్పదు.
Tags:    

Similar News