మా స‌మావేశం నుంచి క‌న్నీళ్ల‌తో వెళ్లిపోయిన పరుచూరి!

Update: 2019-10-20 17:35 GMT
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా)లో విభేదాలు మ‌రింత ముదిరిన‌ట్లే క‌నిపిస్తోంది. ఆదివారం జీవిత రాజ‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌మావేశం ర‌సాభాస‌గా మారింది. `మా` గౌర‌వ స‌ల‌హాదారు కృష్ణంరాజు సంఘం స‌భ్యుల మ‌నోగ‌తం తెలుసుకోవ‌డానికే ఈ స‌మావేశం అని ముందుగా తెలిపారు. అయితే `మా` అధ్య‌క్షుడు న‌రేష్ ఉండ‌గా.. ఆయ‌న్ని ప‌క్క‌న పెట్టి జీవిత రాజ‌శేఖ‌ర్ స‌మావేశం నిర్వ‌హించ‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. రాజ‌శేఖ‌ర్ వ‌ర్గానికి - న‌రేష్ వ‌ర్గానికి మ‌ధ్య మాట‌ల యుద్ధం స‌మావేశం అదుపు త‌ప్పింది. దీంతో కొంద‌రు స‌భ్యులు వాకౌట్ చేసి సమావేశం నుంచి వెళ్లిపోయారు.

స‌మావేశం తీవ్ర ర‌సాభాస‌గా మార‌డంతో `మా` కోశాధికారి ప‌రుచూరి గోపాల‌కృష్ణ కంట‌త‌డి పెట్టుకుంటూ స‌మావేశం నుండి వెళ్లిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సాధార‌ణంగా `మా` జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం అధ్య‌క్షుడి నేతృత్వంలో జ‌ర‌గాలి. ఐతే జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌ర‌పొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో ఫ్రెండ్లీ స‌మావేశం కోస‌మే అంద‌రికీ స‌మాచారం ఇచ్చామ‌ని జీవిత అంటోంది. కొంత కాలంగా `మా` అధ్య‌క్షుడు న‌రేష్ సంఘం కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉండ‌టం - ఆయ‌న మీద అనేక ఆరోప‌ణ‌లు రావ‌డం.. క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హించి - ఎన్నిక‌ల త‌ర్వాత కూడా కొంత కాలం స‌ఖ్య‌త‌తో ఉన్న న‌రేష్‌ - రాజ‌శేఖ‌ర్‌ ల మ‌ధ్య విభేదాలు త‌లెత్త‌డం.. ఈ ప‌రిణామాలతో రోజు రోజుకూ ముదురుతున్న వివాదం.. తాజా స‌మావేశంతో మ‌రింత ముదిరింది.


Tags:    

Similar News