100 కోట్ల సినిమాలో ఇన్ని మైనస్‌ లు ఉన్నాయా?

Update: 2019-06-24 16:41 GMT
టాలీవుడ్‌ లో కొన్ని వందల సినిమాలకు రచయితలుగా వ్యవహరించడంతో పాటు ఇప్పటికి స్టార్‌ హీరోల సినిమాలకు రచన సహకారం అందిస్తున్న పరుచూరి బ్రదర్స్‌ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌ ద్వారా తాము గతంలో పని చేసిన సినిమాలకు సంబంధించిన విషయాలను మరియు ఇతర హీరోల సినిమాలను విశ్లేషిస్తూ వస్తూ ఉంటారు. తాజాగా 'మహర్షి' చిత్రంపై పరుచూరి బ్రదర్‌ గోపాలకృష్ణ కామెంట్స్‌ చేశాడు.

మహేష్‌ బాబు 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి చిత్రం 100 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు మరియు అశ్వినీదత్‌ లు నిర్మించిన ఈ చిత్రంలోని కొన్ని లోపాలను పరుచూరి గోపాలకృష్ణ ఎత్తి చూపడం జరిగింది. ప్రధానంగా ఈ సినిమా మైనస్‌ నిడివి. మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఇంకాస్త ఎడిట్‌ చేసి ఉంటే బాగుండేదేమో. గతంలో ఇంద్ర సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నిడివి కాస్త తగ్గిస్తే బాగుంటుందని అనుకున్నాం. అయితే ఒక్క సీన్‌ కూడా తీసేయకుండా సీన్స్‌ లోని ఫ్రేమ్స్‌ ను తీసి వేస్తూ సినిమాను పది నిమిషాలు తగ్గించాం. మహర్షి చిత్రంలో కూడా నిర్మాత దిల్‌ రాజు మరియు వంశీలు ప్రయత్నిస్తే 10 నుండి 15 నిమిషాల వరకు తగ్గించే అవకాశం ఉంది.

అప్పటికే తగ్గించి అలా ఉంచారో లేదంటే ఉన్నా పర్వాలేదని వారు అనుకున్నారో తెలియదు కాని నిడివి విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకుని ఉండాల్సింది. ఈ చిత్రం కథ క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌ జోనర్‌ లోకి వస్తుంది. స్నేహితుడి వల్ల జీవితం కాపాడబడ్డ హీరో ఆ విషయాన్ని తెలుసుకోవడంలో చాలా ఆలస్యం అయ్యింది. ఆ విషయాన్ని చెప్పేందుకు ముక్కు ఎక్కడ అంటే తల చుట్టు తిప్పనట్లుగా స్క్రీన్‌ ప్లే సాగింది. స్నేహితుడి పాత్రను ఇంకాస్తలో లోపం కనిపించింది.

ఇక ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ఆరిజోన్‌ ను ఒక పల్లెటూరులో పెట్టడం అది కూడా ఒక చెట్టు కింద సెటప్‌ చేయడం సహజత్వంకు చాలా దూరంగా ఉంది. పల్లెటూరుకు హెలికాప్టర్ల మీద వచ్చి హీరోను కలవడం ప్రేక్షకులు కాస్త జీర్ణించుకునే విధంగా లేదు. ఆ ఆఫీస్‌ ఏదో హీరో స్నేహితుడి ఇంట్లో ఏర్పాటు చేస్తే కాస్తలో కాస్త అయినా బెటర్‌ మెంట్‌ ఉండేది. ఏది ఏమైనా సినిమా మంచి హిట్‌ అయ్యింది. పై విధంగా చేస్తే ఫలితం ఎలా ఉండేదో చెప్పలేము. ఏ సినిమా ఎందుకు ఆడుతుందో అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాను ఇష్టపడతారో వారి అభిరుచి ఎలా ఉంటుందో ఆ సమయం వరకు తెలియదంటూ పరుచూరి వారు తన పలుకులను ముగించారు.

Tags:    

Similar News