ఆ మూడు పొరపాట్లు ఆ సినిమాను దెబ్బకొట్టేశాయట!

Update: 2021-03-10 23:30 GMT
తెలుగు తెరపై కథానాయకులుగా ఎంతోమంది తమ ప్రతిభను చాటుకున్నారు. ఎవరికి వారు తమదైన ప్రత్యేకతను అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. కొంతమంది కథానాయకులు ప్రత్యేకమైన తమ వాయిస్ తో మంత్రముగ్ధులను చేశారు. అలాంటి కథానాయకులలో ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ .. కొంగర జగ్గయ్య .. రంగనాథ్ .. సాయికుమార్ కనిపిస్తారు. సాయికుమార్ తరువాత వాయిస్ ప్రధానంగా కట్టిపడేసే ఆర్టిస్ట్ రాలేదనే చెప్పాలి. సాయికుమార్ డైలాగ్ డెలివరీకి చప్పట్లు కొట్టని చేతులు ఉండవంటే అతిశయోక్తి కాదు. డైలాగ్ కింగ్ గా అభిమానుల మనసులను దోచుకున్న ఆయన గురించి, తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.

సాయికుమార్ కుటుంబంతో మొదటినుంచి మాకు మంచి అనుబంధం ఉంది. ఆ కుటుంబంలోని అందరితోను కలిసి పనిచేశాము. ముఖ్యంగా సాయికుమార్ కి ఎక్కువ వేషాలు రాశాము. 'కర్తవ్యం' .. 'మదరిండియా' .. 'సర్పయాగం' ..   సినిమాల్లో తన పాత్రలను ఆయన అద్భుతంగా చేశాడు. అలా ఒకవైపున పాజిటివ్ పాత్రలు .. మరో వైపున నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ మెప్పిస్తూ వచ్చాడు. ఆ తరువాత హీరోగా చేసిన 'పోలీస్ స్టోరీ'తో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కన్నడలో ఈ సినిమా చరిత్ర సృష్టించడం విశేషం.

కన్నడలో హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సాయికుమార్, 'సీమసింహం' సినిమాలో బాలకృష్ణని ఎదుర్కునే విలన్ గా నటించాడు. సాయికుమార్ క్రేజ్ కూడా అప్పటికే విపరీతంగా పెరిగిపోవడంతో, హీరోతో సమానమైన ప్రాధాన్యతనిస్తూ ఆ పాత్రను డిజైన్ చేశాము. బాలకృష్ణగారు కూడా తన పాత్రతో సమానంగా సాయికుమార్ పాత్ర ఉండాలని చెప్పడం విశేషం. సాయికుమార్ కి గల పాజిటివ్ ఇమేజ్ కారణంగా విలన్ గా ప్రేక్షకులు ఆయనను అంగీకరించలేకయారు. 'నరసింహనాయుడు' కోసం ముందుగా అనుకుని ఆ తరువాత పక్కన పెట్టేసిన సెకండాఫ్ ను ఈ సినిమా కోసం తీసుకోవడం .. బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ లోని లోపాలు .. విలన్ గా సాయికుమార్ ను తీసుకోవడం .. ఇవన్నీ కూడా ఈ సినిమా పరాజయం పాలుకావడానికి కారణమయ్యాయి" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News