12 ఏళ్లు వేచి చూసిన ప‌రుచూరి

Update: 2018-08-22 01:30 GMT
ఏడాది కాదు .. రెండేళ్లు కాదు.. ఏకంగా 12ఏళ్లు ఎదురు చూశారు ఆ క‌థ రాసుకుని. ఇన్నేళ్ల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి ఓకే అన్నాక .. దానికి మోక్షం వ‌చ్చింది. ఇంత‌కాలం పాటు స‌ద‌రు ర‌చ‌యిత‌లు అంతే ఓపిగ్గా ఎదురు చూశారు. అంతేకాదు ఈ క‌థ‌ను ఏదోలా ఓకే చేయించుకోవాల‌ని రామ్‌ చ‌ర‌ణ్‌ ని అదే ప‌నిగా షంటేశారు. ఎందుకంటే మెగాస్టార్‌ ని నేరుగా షంటేసే ధైర్యం ఎవ‌రికి ఉంటుంది. స‌మ‌యానుకూలంగా ఎట్నుంచి క‌థ‌ను న‌డిపించాలో తెలిసిన రాజ‌నీతిజ్ఞులుగా ఆ ఇద్ద‌రూ ఇటు చ‌ర‌ణ్ వైపునుంచి న‌రుక్కొచ్చారు. అందుకోసం ఏకంగా అంత‌కాలం ప‌ట్టింది. ప్ర‌తిసారీ క‌థ విని చూద్దాంలే అని మెగాస్టార్ తిప్పి పంపించేవార‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మైంది. చివ‌రికి 2006లో మొద‌లు పెట్టిన ప్ర‌య‌త్నం 2018 నాటికి ఫ‌లించింది. ఇంత ఓపిక ఉన్న‌వాళ్లు కాబ‌ట్టే ప‌రుచూరి వారు దాదాపు 350 పైగా సినిమాల‌కు క‌థ‌లు రాయ‌గ‌లిగార‌న్న‌మాట‌.

సైరా టీజ‌ర్ ఈవెంట్‌ లో ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ - చిరంజీవి గారి జీవితం - మా జీవితం ఖైదీ సినిమాతో ముడిప‌డిన‌ది. అప్ప‌టినుంచి మా అనుబంధం ముడిప‌డిపోయింది. రామ్‌ చ‌ర‌ణ్ - సురేంద‌ర్ రెడ్డి త‌మ‌కు కావాల్సిన ఔట్‌ పుట్ తీసుకుంటారు. శ్రీ‌కృష్ణుడు - అర్జునుడులా త‌మ‌కు కావాల్సిన‌దే తీసుకుంటారు. చ‌ర‌ణ్ ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డినే ఎందుకు ఎంచుకున్నాడో మాకు అప్పుడే అర్థ‌మైంది. సైరా క‌ల ప‌న్నెండేళ్ల‌కు నెర‌వేరుతోంది`` అని తెలిపారు.

ఇదే వేదిక‌పై ప‌రుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ -``30 సెక‌న్ల టీజ‌ర్ బీపీ రెయిజ్ చేసింది. మూడున్న‌ర గంట‌ల సినిమా ఇంకెంత ఉత్కంఠనిస్తుందో అన్న అంచ‌నా పెంచింది ఈ టీజ‌ర్‌. చిరంజీవి క‌ళ్ల‌లోనే భాష ఉంది. అద్భుత క‌థ‌ - సంగీతం - కెమెరా అన్నీ కుదిరిన చిత్ర‌మిది. ధ‌ర్మ‌జుడిలా చ‌ర‌ణ్‌ - అర్జునుడిలా చిరంజీవి ప‌ని చేస్తున్నారు. 356 సినిమాల‌కు రాశాం. 10-15 సినిమాల పేర్లు గొప్ప‌గా చెప్పుకుంటాం. ఏ సినిమాకి మీరు గ‌ర్వించేలా రాశారు? అంటే సైరా పేరు చెప్పుకుంటాం. పుర‌స్కారాల త‌ర‌హాలో 12 ఏళ్ల‌కు మా క‌ల నెర‌వేరుతోంది. ఉయ్యాల‌వాడ పాత్ర‌లో చిరంజీవి చ‌రిత్ర సృష్టిస్తారు`` అని అన్నారు. మొత్తానికి ప‌న్నెండేళ్ల కల ఫ‌లించినందుకు ఆ ఇద్ద‌రి క‌ళ్లలో మెరుపులు క‌నిపించాయి.
Tags:    

Similar News