'వీరమల్లు' అప్డేట్: పవన్ బర్త్ డే స్పెషల్ గా 'పవర్ గ్లాన్స్'..!

Update: 2022-08-31 05:42 GMT
సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ రోజు. దీని కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈసారి జనసేన అధినేత బర్త్ డే సంబరాలు అంబరాన్ని అంటేలా జరపాలని ప్లాన్ చేశారు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి 'హరి హర వీరమల్లు' టీమ్ ఆసక్తికరమైన అప్డేట్ తో వచ్చింది.

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ''హరి హర వీరమల్లు''. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు - కుతుబ్ షాహీలకు సంబంధించిన చారిత్రక కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన 'హరి హర వీరమల్లు' ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ పుట్టినరోజు స్పెషల్ గా మేకర్స్ ఓ సర్ప్రైజింగ్ గిప్ట్ తో రాబోతున్నారు.

'హరి హర వీరమల్లు' సినిమా నుంచి 'పవర్ గ్లాన్స్' పేరుతో ప్రత్యేకమైన గ్రాండ్ వీడియోని రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 05:45 గంటలకు వస్తుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇది టీజర్ కు తక్కువగా గ్లిమ్స్ కు ఎక్కువగా ఉండే ఈ వీడియో అద్భుతంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్.

ఈరోజు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వీరమల్లు టీమ్ ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ పోస్టర్ ని వదిలారు. మాసివ్ బ్లిట్జ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ పవర్ స్టార్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేశారు మేకర్స్.

'హరి హర వీరమల్లు' అనేది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో భారీ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో ఐదు ప్రధాన భారతీయ భాషల్లో ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్ - నర్గిస్ ఫక్రి లతో పాటుగా ఆదిత్య మీనన్ - పూజిత పొన్నాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీర‌వాణి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News