మీడియాపై పవన్ ఎఫెక్ట్

Update: 2018-04-25 04:13 GMT
కాస్టింగ్ కౌచ్ పై యుద్ధం అంటూ యాక్టర్ శ్రీరెడ్డి మొదలెట్టిన ఇష్యూలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇన్వాల్స్ అయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తిట్టించడం టాలీవుడ్ ను ఉలిక్కిపడేలా చేసింది. ఇదంతా తనను టార్గెట్ చేస్తూ ఏబీఎన్ - టీవీ9 - టీవీ5 - మహాన్యూన్ వంటి కొన్ని మీడియా ఛానళ్లు పన్నుతున్న కుట్ర అంటూ పవన్ కళ్యాణ్  రియాక్టయ్యాడు. రియాక్టవడమే కాదు.. వాటిపై పోరాటం కూడా మొదలెట్టాడు.

ముందు పవన్ ఆగ్రహంతో ఉన్నాడని భావించి టాలీవుడ్ సంఘీభావం ప్రకటించి ఊరుకుంది. కానీ ఈ ఇష్యూలో పవన్ చాలా సీరియస్ గా ఉన్నాడని తరవాత పరిణామాలతో తేలిపోయింది. దీంతో ఇండస్ట్రీ కూడా ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకోవడం మొదలెట్టింది. ఎప్పుడో తుపానులొచ్చినప్పుడో.. క్రికెట్ మ్యాచులకో ఒకచోట కనిపించే సినిమా స్టార్లంతా ఒకచోట మీటయ్యారు. రకరకాల పనుల్లో బిజీగా ఉండే సినీ జీవులంతా ఓ ఇష్యూపై ఒకచోట కలిసి మాట్లాడటం చాలా అరుదు. ఆ రకంగా ఇండస్ట్రీని మొత్తం ఒకతాటిపైకి తీసుకురావడంలో పవన్ కొంత విజయం సాధించినట్టే. తమ్ముడికి మద్దతుగా ఎక్కుమందిని మీటింగ్ కు వచ్చేలా మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారని ఇన్ సైడ్ టాక్.

ఈ మీటింగ్ లో ఏం చర్చించారు.. ఏ నిర్ణయం తీసుకున్నారన్నది ఇంకా తేలకపోయినా మీడియాపై దీని ఎఫెక్ట్ మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీ గురించి చిన్న మాట వినిపించినా వాళ్లనూ.. వీళ్లనూ తీసుకొచ్చి గంటలకు గంటలకు చర్చలు పెట్టే టీవీ ఛానళ్లు ఇప్పుడు చడీచప్పుడు చేయడం లేదు. శ్రీరెడ్డి.. కత్తి మహేష్ పవన్ పై దాడిని మరింత తీవ్రం చేస్తూ ట్వీట్లు పెట్టినా చర్చా వేదికల ఊసే లేదు. ఇదంతా కచ్చితంగా పవన్ పోరాట ఫలితమేనని చెప్పక తప్పదు. న్యూస్ ఛానళ్లకు ఇండస్ట్రీ సపోర్ట్ చాలా అవసరం. అందుకని వీలైనంత వరకు దూరాన్ని పెంచుకోకూడదనే రీతిలోనే ఛానళ్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది మీడియా స్వీయ నియంత్రణా.. లేక యుద్ధం ముందు ప్రశాంతతా అనేది ముందుముందు తెలుస్తుంది.


Tags:    

Similar News