పాటలు.. ఫైట్లు ప‌వ‌న్‌ వే!

Update: 2015-12-15 05:27 GMT
ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ లో ఓ ఆల్‌ రౌండ‌ర్ ఉన్నాడ‌న్న విష‌యం తెలిసిందే. అకిరా కుర‌సోవాలాంటి ద‌ర్శ‌కుల్ని అమితంగా ఆరాధించే ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ తాను క‌థానాయ‌కుడిగా  తెర‌పైకి అడుగుపెట్ట‌క‌ముందే సినిమా గురించి బోలెడు విష‌యాలు  తెలుసుకొన్నాడు. తొలి సినిమా నుంచే త‌న‌కి తెలిసిన కొన్ని విద్య‌ల్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చాడు.  గుడుంబా శంక‌ర్‌ - ఖుషీలాంటి సినిమాల‌కి యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌ గా మారి త‌న ఫైట్లు తానే కంపోజ్ చేసుకొన్నాడు. జానీతో ద‌ర్శ‌కుడిగా కూడా మారాడు.

అయితే ఆ చిత్రం పరాజ‌యాన్ని చ‌విచూడ‌టంతో ఆ త‌ర్వాత కొంత‌కాలం పాటు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం గురించికానీ,  సినిమాకి సంబంధించిన ఇత‌రత్రా విష‌యాల‌పై గానీ దృష్టిపెట్ట‌లేదు. కేవ‌లం ద‌ర్శ‌కులు చెప్పింది చేస్తూ వ‌చ్చాడు. అయితే గ‌బ్బ‌ర్‌ సింగ్ త‌ర్వాత మాత్రం  మ‌ళ్లీ ఆయ‌న‌లోని టెక్నీషియ‌న్ పైకి లేచాడు. ఈసారి ర‌చ‌యిత‌గా మారి  గ‌బ్బ‌ర్‌ సింగ్‌ కి సీక్వెల్ క‌థ‌ని త‌యారు చేశాడు. అయితే మూల క‌థ‌ని ఇచ్చి దాన్ని  డెవ‌ల‌ప్ చేసిన‌వాళ్ల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాన్ని ఇవ్వాల‌నుకొన్నాడు.  ఆ మేర‌కు సంప‌త్ నంది  మొద‌లుకొని ప‌లువురు ద‌ర్శ‌కులు ప‌వ‌న్ క‌థ‌ని డెవ‌ల‌ప్ చేయాల‌ని ప్ర‌య‌త్నించారు.  కానీ చివ‌రికి బాబీ ఓకే అయ్యాడు. దీంతో స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ ప‌ట్టాలెక్కింది.

అయితే ఈ సినిమాకి పాట‌లు, ఫైట్లు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణే డిజైన్ చేసుకుంటున్నాడ‌ట‌. ఆ విష‌యాన్ని ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ మిత్రుడు - చిత్ర నిర్మాత అయిన శ‌ర‌త్ మ‌రార్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూ లో వెల్ల‌డించారు. ఫైట్లు ప‌వ‌నే డిజైన్ చేసినా... వాటిని తెర‌పైకి తీసుకొచ్చే విష‌యంలో ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ కి రామ్‌ ల‌క్ష్మ‌ణ్‌ లు స‌హాయం చేస్తున్నార‌ట‌.
Tags:    

Similar News