పాపం పవన్‌.. అందరి నోట ఇదే మాట

Update: 2019-05-24 12:04 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన విజయాన్ని ముందే అంతా ఊహించారు. కాని ఈ స్థాయిలో మెజార్టీ దక్కుతుందని మాత్రం ఎవరు ఊహించలేదు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్న సమయంలో కూడా ఏ పార్టీ ఇంత భారీ మెజార్టీని దక్కించుకున్న దాఖలాలు లేవు. ప్రజలు జగన్‌ కు ఏక పక్షంగా పట్టాభిషేకం కట్టేశారు. జగన్‌ ఇలాంటి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ ఓటమి గురించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది.

రాజకీయ ఉద్దండుడిగా తనకు పేరుందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో దారుణమైన పరాజయం పాలయ్యాడు. దాంతో ఆయనపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్‌ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో చంద్రబాబు నాయుడును ఒక ఆట ఆడేసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కనీసం తాను పోటీ చేసిన స్థానాలను కూడా గెలువలేక పోయిన పవన్‌ కళ్యాణ్‌ పై మాత్రం నెటిజన్స్‌ సానుభూతి చూపిస్తున్నారు. కొత్త రాజకీయాలను పరిచయం చేస్తానంటూ వచ్చిన పవన్‌ కు పాపం మరీ దారుణమైన పరిస్థితి ఎదురైందంటూ అయ్యో పాపం అంటున్నారు.

పవన్‌ ప్రభావం ఈ ఎన్నికల్లో ఉంటుందని, తప్పకుండా ఆయన కింగ్‌ కాకున్నా కూడా కింగ్‌ మేకర్‌ అయితే అవుతాడంటూ రాజకీయ విశ్లేషకులు కొందరు భావించారు. కాని అనూహ్యంగా పవన్‌ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడి పోవడంతో పాటు, తన అన్న పోటి చేసిన పార్లమెంటు స్థానంను కూడా గెల్చుకోలేక పోయాడు.

పవన్‌ కు వచ్చిన ఫలితాలపై ఆయన అభిమానులు నిరుత్సాహ పడకుండా గొప్ప ప్రయత్నం చేశాడని, కొత్త రాజకీయాలకు ప్రయత్నించాడని కాకుంటే జగన్‌ వైపు ప్రజలు ఉన్నారని అనుకుంటున్నారు. పవన్‌ చేసిన ప్రయత్నంను అభినందించాల్సిందే అంటున్నారు. మొత్తానికి ఒక్క సీటు కూడా పవన్‌ గెలవలేక పోవడంతో ఆయన అభిమానులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఆయన్ను అయ్యో పాపం అంటున్నారు. వచ్చే ఎన్నికల వరకు పార్టీని కాపాడుకుని మళ్లీ పోటీ చేస్తే వైకాపాకు పవన్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News