ఇంత‌కీ స‌ర్దార్ మ‌న‌సులో ఎవ‌రున్నారు?!

Update: 2015-08-18 04:47 GMT
ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ప్ర‌తీ విష‌యంలోనూ టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు. మొన్న‌టిదాకా సినిమాని సెట్స్‌ పైకి తీసుకెళ్లే విష‌యంలో టెన్ష‌న్ పెట్టించాడు. ఇప్పుడు హీరోయిన్ విష‌యంలోనూ అదే త‌ర‌హా టెన్ష‌న్‌. `గ‌బ్బ‌ర్‌ సింగ్‌` సీక్వెల్ అంటూ అభిమానుల్ని రెండేళ్లుగా ఎదురు చూయించాడు ప‌వ‌న్‌. ఎప్పుడెప్పుడు ఆ సినిమా మొద‌ల‌వుతుందా అంతా క‌ళ్లు కాయ‌లు కాచేలా చూశారు.

`గ‌బ్బ‌ర్‌ సింగ్` ప్రేక్ష‌కుల‌పై చూపిన ఎఫెక్ట్ అలాంటిది మ‌రి! ప‌వ‌న్‌ లోని హీరోయిజాన్ని పీక్స్‌ లో చూపించింది. మాస్ అభిమానుల‌కి పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింది. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే అంద‌రికీ ఆస‌క్తే క‌దా! అయితే రెండేళ్లలో ర‌క‌ర‌కాల మ‌లుపులు తిరిగి ఆ ప్రాజెక్టు బాబీ ద‌ర్శ‌కుడిగా ఇటీవ‌లే సెట్స్‌ పైకి వెళ్లింది ఆ చిత్రం. ఆరేడు నెల‌ల క్రిత‌మే ఆ సినిమాలో హీరోయిన్ ఈమే అంటూ ఒక‌రి పేరుని ప్ర‌క‌టించారు. కానీ ఈమ‌ధ్య ఆమెని తొలగించి వేరే క‌థానాయిక‌ని ఎంపిక చేసుకోవ‌డంపై దృష్టి పెట్టింది చిత్ర‌బృందం. ఆ వేరే హీరోయిన్  ఎవ‌ర‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ తో ఈసారి కాజ‌ల్ న‌టించ‌బోతోంద‌ని, `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్‌`లో హీరోయిన్‌ గా ఆమెనే ఎంపిక చేశార‌ని ప‌క్షం రోజుల‌కిందే మాట్లాడుకొన్నారు. కాజ‌ల్ సెట్స్‌ కి వెళ్లి యూనిట్‌ ని అంతా ప‌ల‌క‌రించి వ‌చ్చింద‌ని కూడా చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడేమో స‌మంత పేరు వినిపిస్తోంది. ద‌ర్శ‌కుడు బాబీ, స‌మంత క‌లిసి ఓ సెల్ఫీ తీసుకొన్నారు. అది ఇంట‌ర్నెట్‌ లో హ‌ల్‌ చ‌ల్ సృష్టిస్తోంది.  సినిమా గురించి మాట్లాడుకోవ‌డానికే ఇద్ద‌రూ క‌లిశార‌నీ, స‌మంత ఎంపిక దాదాపు ఖాయ‌మైన‌ట్టే అని ఫిల్మ్‌ న‌గ‌ర్ గుస‌గుస‌లు.

ఇంత‌కీ అస‌లు స‌ర్దార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ మ‌న‌సులో ఎవ‌రున్నార‌న్న‌ది తేలాలి. అన్న‌ట్టు స‌మంత ప్ర‌స్తుతం తెలుగులో చేస్తున్న సినిమాలేవీ లేవు. వ‌చ్చే నెల 14 త‌ర్వాతే బ్ర‌హ్మోత్స‌వం మొద‌ల‌వుతుంది. అంటే స‌మంత ఆ త‌ర్వాతే హైద‌రాబాద్‌ కి రావాలి. కానీ ఆమె మాత్రం రెండు మూడు రోజులుగా హైద‌రాబాద్‌ లోనే మ‌కాం వేసింది. ప‌వ‌న్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవ‌డానికే ఆమె ఇక్క‌డికొచ్చింద‌ని అంటున్నారు. అస‌లు నిజ‌మేంటో మ‌రో వారం రోజుల్లో తెలిసిపోయే అవ‌కాశాలున్నాయి.

Tags:    

Similar News