'పవర్ స్టార్' ట్యాగ్ ని పవన్ వదులుకోవాలని చూస్తున్నాడా..?

Update: 2021-09-05 03:30 GMT
'పవన్ కళ్యాణ్' పేరు చెప్పగానే అందరికీ వెంటనే 'పవర్ స్టార్' అని గుర్తుకు వస్తుంది. పవర్ స్టార్ అంటే పవన్.. పవన్ అంటే పవర్ స్టార్ అనే విధంగా ఈ ట్యాగ్ ఒక బ్రాండ్ గా నిలిచిపోయింది. నిజానికి పవన్ కళ్యాణ్ ఇలాంటి 'స్టార్' ట్యాగులను పెద్దగా ఇష్టపడరు. అభిమానులు ప్రేమతో అలా పిలుస్తుండటంతో ఇన్నాళ్లూ 'పవర్ స్టార్ పవన్ కల్యాణ్' గా కొనసాగారు. అయితే పవన్ ఇప్పుడు హీరోగానే కాకుండా పొలిటికల్ లీడర్ గా ఎదుగుతున్న నేపథ్యంలో ఇకపై ఇలాంటి స్టార్ ట్యాగ్ లను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సినిమాల అప్డేట్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. 'భీమ్లా నాయక్' 'హరి హర వీరమల్లు' '#PSPK28' '#PSPK29' సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ లో జస్ట్ పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే బర్త్ డే విషెస్ అందజేశారు. అభిమానులు కూడా ఎక్కువగా 'జనసేనాని' అనే పేరుతేనే శుభాకాంక్షలుచెప్పారు. కాకపోతే 'పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్' ని సంక్షిప్తంగా 'PSPK' అనే ట్యాగ్ ని మాత్రం ఉపయోగించారు.

ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి 'పవర్ స్టార్' ట్యాగ్ ని వదులుకుంటున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఇకపై ఆయన్ని 'జనసేనాని' గానే ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ లో 'పవర్ స్టార్' లేకుండానే ట్రెండ్ చేసారని అనుకుంటున్నారు. అయినా పవన్ కళ్యాణ్ కు ఉండే చరిష్మాకి ఫ్యాన్ ఫాలోయింగ్ కి స్టార్ ట్యాగ్ లు అవసరం లేదని చెప్పవచ్చు.

వాస్తవానికి ప్రతి ఒక్కరికీ ఇంటిపేరు ఉన్నట్లే సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకి ఓ 'స్టార్' ట్యాగ్ ఉండటం అనేది కామన్. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఈ ట్యాగుకు అనేవి సాంప్రదాయంగా వస్తున్నాయి. కొందరు హీరోలకు తమ ఫ్యాన్స్ ఈ బిరుదులు ఇచ్చుకుంటే.. మరికొందరు హీరోల పెరఫార్మన్స్ ని బట్టి సినీ అభిమానులు ఈ ట్యాగ్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు 'పవర్ స్టార్' అనే ట్యాగ్ మాత్రం ప్రముఖ నటుడు, దర్శక రచయిత పోసాని కృష్ణ మురళి వల్ల వచ్చిందనే సంగతి తెలిసిందే.


Tags:    

Similar News