పీకే... ప్ర‌కాశ్ రాజ్ మాట వినబ‌డిందా?

Update: 2017-11-02 05:00 GMT
ప్ర‌కాశ్ రాజ్‌... ద‌క్షిణాది భాషా చిత్రాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్‌. ఓ పాత్ర అయినా అందులో ఇట్టే ఇమిడిపోయే ప్ర‌కాశ్ రాజ్‌కు చాలా ప్రాంతాల్లో హీరో రేంజ్ లో అభిమానులు కూడా ఉన్నారు. ద‌క్షిణాది భాషా చిత్రాల న‌టుడే అయినా ప్ర‌కాశ్ రాజ్‌... ఎప్పుడో జాతీయ స్థాయి న‌టుడిగా గుర్తింపు సంపాదించారు. సినిమాల్లో మంచి న‌టుడిగా గుర్తింపు సాధించిన ప్ర‌కాశ్ రాజ్‌... ప్ర‌తి విష‌యంపైనా స్పందిస్తూ ప‌లుమార్లు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఏ విష‌యంపై అయినా త‌న మ‌న‌సులోని మాట‌ను సూటిగా సుత్తి లేకుండా చెప్పేయ‌డంలో ప్ర‌కాశ్ రాజ్ దిట్ట‌గానే చెప్పుకోవాలి. ఎందుకంటే... స్టార్ డ‌మ్‌ను నాశ‌నం చేసుకునేందుకు ఏ ఒక్క‌రూ సాహ‌సించ‌ని ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌కాశ్ రాజ్ మాత్రం త‌న స్టార్ డ‌మ్ ఎక్క‌డ నాశ‌న‌మ‌వుతుందోన‌న్న భ‌యం ఏమాత్రం లేకుండానే కామెంట్లు చేస్తుంటారు. ఇలా చాలా సార్లు ప్ర‌కాశ్ రాజ్ ఇబ్బందులు ప‌డిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

ప్ర‌స్తుతం త‌మిళనాట సూప‌ర్ స్టార్లు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, క‌న్న‌డ‌నాట ఉపేంద్ర రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగు నాట అశేష అభిమానుల‌ను క‌లిగిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇప్ప‌టికే రాజ‌కీయ రంగంలోకి దిగిపోయారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందే జ‌న‌సేన పేరిట రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌... ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగ‌డానికి బ‌దులుగా బీజేపీ, టీడీపీ కూట‌మిని మ‌ద్ద‌తిచ్చి... ఏపీలో టీడీపీ అధికారం కైవ‌సం చేసుకోవ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే ఆ త‌ర్వాత అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌జాక్షేత్రంలో వ‌స్తూ పార్ట్ టైమ్ పొలిటీషియ‌న్‌గా అపప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ అవ‌తారం ఎత్తేందుకు ప‌వ‌న్ దాదాపుగా రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లే తాజా వార్తా క‌థ‌నాలు వెల్డిస్తున్నాయి. ఈ క్ర‌మంలో అస‌లు రాజ‌కీయ రంగంలో విజ‌యం సాధించాలంటే ఎలాంటి ల‌క్ష‌ణాలుండాలి అన్న అంశంపై ప్ర‌కాశ్ రాజ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. అటు ర‌జ‌నీ, క‌మ‌ల్‌, ఉపేంద్ర‌ల పేర్ల‌తో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును కూడా ప్ర‌స్తావిస్తూ ప్ర‌కాశ్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లమే రేపుతున్నాయి.

భార‌త్ లాంటి దేశంలో ప్ర‌జా ప్ర‌తినిధిగా మారాలంటే ఒక్క న‌టుడి హోదా మాత్ర‌మే స‌రిపోత‌ద‌ని ప్ర‌కాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. అయితే ప్ర‌జా ప్ర‌తినిధిగా రాణించాలంటే మ‌రేం చేయాల‌న్న ప్ర‌శ్న‌కు కూడా ఆయ‌నే స‌మాధానం చెబుతూ ప్ర‌జల విశ్వాసాన్ని చూర‌గొన్న‌వాడే ప‌బ్లిక్ రిప్ర‌జెంటేటివ్ గా మార‌గ‌ల‌డ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితా ఈ అంశంపై ప్ర‌కాశ్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు  ఏలా ఉన్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే... *ప్ర‌జా ప్ర‌తినిధిగా మారాలంటే కేవ‌లం న‌టుడిగా బ‌రిలోకి దిగితేనే స‌రిపోదు. భార‌త్ లాంటి దేశంలో ఇది చాలా క‌ష్టం. ర‌జ‌నీ, క‌మ‌ల్‌ల‌కు నేను వీరాభిమానినే. వారు ఏ ప‌ని చేసినా కూడా వారిపై నాకున్న అభిమానం ఇసుమంత కూడా త‌గ్గ‌దు. అయితే ఓ అభిమానిగా నేను వారికి ఎన్న‌డూ కూడా ఓటు వేయ‌ను. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అయినా, మ‌రెవ‌రైనా నా అభిప్రాయం మార‌దు. ప్రజా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌గ‌లిగే సామ‌ర్ధ్యం త‌మలో ఉంద‌ని వారు నిరూపించుకోవాల్సిందే. ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొనాల్సిందే. ఎవ‌రైనా ఏదైనా కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నారంటే... వారు స‌క్సెస్ కావాల‌న్నా... ప‌రాజ‌యం పాలు కావాల‌న్నా అదంతా వారి చేతుల్లోనే ఉంది. అయితే ప్ర‌జ‌లు అంగీక‌రించే వ్య‌క్తులే నాయ‌కులుగా ఎదుగుతారు* అని ప్ర‌కాశ్ రాజ్ త‌న మ‌న‌సులోని మాట‌ను కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై పొలిటిక‌ల్ లీడ‌ర్లుగా మారుతున్న మ‌న యాక్ట‌ర్స్ ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News