పవన్ ప్రయాణం .. 5 వేల నుంచి 50 కోట్ల వరకూ!

Update: 2021-09-22 09:30 GMT
పవన్ కల్యాణ్ .. ఈ పేరు వింటే చాలు యూత్ ఊగిపోతోంది. వాళ్లలోని ఉత్సాహం చెలరేగిపోతుంది. ఆయన స్టైల్ కి వాళ్లు చప్పట్లు కొడతారు .. ఆయన మేనరిజానికి హారతులు పడతారు. అంతగా పవన్ యూత్ ను ప్రభావితం చేశారు. కెరియర్ ఆరంభంలో కాస్త కొత్త కొత్తగా .. మొహమాటంతో తెరపై కనిపించిన పవన్, ఆ తరువాత తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకుని విజృంభించిన విధానం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. చాలా తక్కువ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ప్రభావితం చేసిన అరుదైన హీరోలలో పవన్ ముందువరుసలో కనిపిస్తారు.

పవన్ కల్యాణ్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. 1996లో వచ్చిన ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి సినిమాతో పవన్ ఎంత పారితోషికం అందుకుని ఉంటారనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఆయన అభిమానులకు ఉండటం సహజం. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యేవరకూ పవన్ కి నెలకి 5 వేలు చొప్పున అల్లు అరవింద్ ఇస్తూ వచ్చారని ఒక ఇంటర్వ్యూలో పవన్ చెప్పారు .. అదే ఆయన పారితోషికం.

ఆ తరువాత పవన్ కథల పరంగా .. పాత్రల పరంగా వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్లారు. మెగాస్టార్ బ్రదర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎక్కడా .. ఎప్పుడూ సరదాగా కూడా ఆయన చిరంజీవిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ యూత్ హృదయాలను కొల్లగొట్టింది. ఒకప్పుడు కెమెరా ముందు సిగ్గరిగా ఉన్న పవన్ .. ఆ తరువాత తన ముందు కెమెరా ఉందనే విషయాన్ని పట్టించుకోనట్టుగా చాలా సహజంగా చేసే స్థాయికి ఎదిగారు. అదే ఆయనలోని ప్రత్యేకతగా నిలిచింది. అదే ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది.

పవన్ కి మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం ఉంది. కథాకథనాలపై మంచి అవగాహన ఉంది. తన సినిమాలను తాను డైరెక్ట్ చేసుకోగల సామర్థ్యం ఉంది. తాను నమ్మిన దర్శకులతో ధైర్యంగా ముందుకువెళ్లే ఆత్మవిశ్వాసం ఉంది. తెలుగు సినిమా బిజినెస్ ను ఒక రేంజ్ తీసుకెళ్లిన హీరోలలో ఆయన ఒకరుగా నిలిచారు. ఇలా పవన్ చాలా తక్కువ సమయంలోనే అన్ని వైపుల నుంచి ఎదుగుతూ వచ్చారు. అందువల్లనే మొదటి సినిమాకి నెలకి 5 వేలు తీసుకున్న ఆయన, ఇప్పుడు సినిమాకి 50 కోట్లను పారితోషికంగా అందుకుంటున్నారు. ఇకపై ఆయన పారితోషికం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని చెప్పుకుంటున్నారు. తనని తాను మలచుకోవడం అంటే ఇదే! తన చుట్టూ ఉన్నవారిని గెలుచుకోవడం అంటే ఇదే!!




Tags:    

Similar News