నేను ఆ మాట చెప్పడంతో పవన్ షాకయ్యారు: అడివి శేష్

Update: 2022-06-20 09:30 GMT
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో హీరో స్థాయి వరకూ రావడం .. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదనే టాక్  ఉంది. కానీ  చిరంజీవి .. రవితేజ .. శ్రీకాంత్ .. నాని వంటివారు టాలెంట్ ముఖ్యమనే విషయాన్ని నిరూపించారు. తాజాగా అలాంటివారి జాబితాలో అడివి శేషు కూడా చేరిపోయాడు. చిన్న చిన్న వేషాల నుంచి హీరో వేషాల వరకూ వెళ్లిన అడివి శేష్, ఆ తరువాత 'క్షణం ' .. 'గూఢచారి' .. ' ఎవరు' సినిమాలతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన  క్రేజ్ ను తెచ్చుకున్నాడు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఆయన పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ .. "నేను  పుట్టింది ఇక్కడే .. పెరిగిందంతా అమెరికాలో. అయితే తెలుగు నేలను గానీ .. తెలుగు భాషనుగాని నేను మరిచిపోలేదు. మా నాన్నగారికి సినిమాల్లోకి రావాలని ఉండేది .. కానీ కాలం అందుకు సహకరించలేదు. ఇక నాకు హీరోను కావాలని ఉండేది .. తెలుగు సినిమాలపై శ్రద్ధ పెరుగుతూ వచ్చింది. నేను దాచుకున్న డబ్బుతో 'కర్మ' అనే ఒక సినిమా చేశాను. ఆ సినిమా తెలుగులో అసలు ఆడలేదుగానీ, స్పానిష్ అనువాద హక్కులు అమ్మడం వలన 60 శాతం డబ్బులు వచ్చాయి.

తెరపై నటుడు ఆ పాత్రకి తగినట్టుగా కనిపించాలనేది నా ఉద్దేశం .. అందువల్లనే 84 కేజీలు ఉన్న నేను, 'మేజర్' సినిమా కోసం 73 కేజీలకు వచ్చేశాను. నేను బాలీవుడ్ ఆర్టిస్ట్ లా ఉంటాననీ .. విలన్ రోల్స్ చేస్తే బాగుంటుందని దిల్ రాజు అన్నారు.

అందువలన ఆరంభంలో ఆ తరహా పాత్రలు చేయవలసి వచ్చింది. ఇక పవన్ కల్యాణ్  గారు నేను హిందీ ఆర్టిస్ట్ ను అనుకుని నాతో హిందీలో మాట్లాడేవారు. నేను తెలుగువాడినని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ చాలామంది అదే భావనలో ఉన్నారు.

ఫారిన్ లో ఉన్నప్పుడు ఒక పంజాబీ అమ్మాయిని ప్రేమించాను. నా పుట్టినరోజునే ఆమె పెళ్లి జరిగింది. ఆ తరువాత భయమో .. ఇబ్బందో తెలియదుగానీ పెళ్లిపై అంతగా ఆసక్తి లేకుండా పోయింది. ఇప్పుడు నా పెళ్లిని గురించి కాకుండా నా కెరియర్ ను గురించి ఆలోచిస్తున్నాను. 'గూఢచారి 2' .. 'హిట్ 2'తో పాటు మరో మూడు ప్రాజెక్టులు చేయవలసి ఉంది.

ఈ ఐదు సినిమాలు కూడా విభిన్నమైన కంటెంట్ తో రూపొందనున్నాయి. ఎలాంటి నేపథ్యం లేకపోయినా, నా ప్రవర్తన నన్ను ఇండస్ట్రీలో నిలబెడుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News