జ‌ల్సా 4 కె వెన‌కున్న మాస్ట‌ర్ మైండ్ ఎవ‌రు?

Update: 2022-08-13 11:30 GMT
టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్ 4కె ప్రింట్ పేరుతో పెద్ద ర‌చ్చ‌కే తెర‌లేపారు. ఇప్ప‌డ‌ది ఇండ‌స్ట్రీలో వున్న స్టార్ హీరోల ఫ్యాన్స్ ని రెచ్చ‌గొట్టేస్తోంది. రీసెంట్ గా అంటే ఆగ‌స్టు 9న స్టార్ హీరో సూప‌ర్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీ హిట్ `పోకిరి`ని 4కె ప్రింట్ లోకి మార్చి ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు యుఎస్ లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాని మ‌హేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హోరెత్తించారు.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ని పాపుల‌ర్ థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ కోసం 375 ప్రీమియ‌ర్ షోల‌ని ప్లాన్ చేశార‌ట‌. చెన్నై, బెంగ‌ళూరుతో పాటు యుఎస్ లోనూ భారీ స్థాయిలో విడుద‌లై రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ప్రీమియ‌ర్ షోల ద్వారా ఏకంగా రూ. 1.72 కోట్ల గ్రాస్ ని వ‌సూలు చేయ‌డం రికార్డుగా మారింది.

రీరిలీజ్ లో ఒక సినిమా ఈ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో ఇది `పోకిరి` రికార్డుగా మారింది. ఈ మూవీ ప్రీమియ‌ర్ షోల ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని ఎంబీ ఫౌండేష‌న్‌కి, తెలుగు ఫిలిం డైరెక్ట‌ర్స్ ట్ర‌స్ట్ కి ఇవ్వ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ సాధించిన వ‌సూళ్ల‌ని, ప్ర‌ద‌ర్శించిన షోల‌ని కూడా ఫ్యాన్స్  ప్ర‌త్యేకంగా చూస్తున్నారు.

ఈ రికార్డును మ‌రో హీరో సినిమా కొట్ట‌లేద‌ని మ‌హేష్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఛాలెంజ్ చేస్తుండ‌టంతో దీన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సీరియ‌స్ గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ పుట్టిన రోజున బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `జ‌ల్సా` ప్రీమియ‌ర్ ల కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ముందు `పోకిరి` 4కె ప్రింట్ రాబోతోంద‌ని తెలిసిన స‌మయంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ వ‌ర్గాల‌ని `జ‌ల్సా` 4కె ప్రింట్ కోసం రిక్వెస్ట్ చేశారు.

అయితే ఒరిజిన‌ల్ ప్రింట్ ఎక్క‌డో మిస్స‌యింద‌ని చెప్పడంతో ఫ్యాన్స్ లో కొంత గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆ త‌రువాత ఆ ప్రింట్ ని వెతికి పెట్టి దాన్ని 4కె మార్చ‌డానికి, ఆ వ‌ర్క్ ని ఫినిష్ చేయించి అంతా ప‌క్క‌గా ప్లాన్ చేసి ఫైన‌ల్ గా అనుకున్న స‌మ‌యానికి అభిమానుల కోరిక మేర‌కు `జ‌ల్సా` 4 కె ప్రింట్ ని సిద్ధం చేయించ‌డంతో ప్ర‌ముఖ పాత్ర‌ని బ‌న్నీవాసు పోషించార‌ట‌. అల్లు అర‌వింద్ కి అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించిన బ‌న్నీ వాసు `జ‌ల్సా` 4కె ప్రింట్ ని సిద్ధం చేయించార‌ట‌.

`జ‌ల్సా`లో ప‌వ‌న్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సాంగ్స్ ఇప్ప‌టికీ ట్రెండ్ అవుతూనే వుంటాయి. విజువ‌ల్ గా గ్రాండీయ‌ర్ గా వుంటాయి. 4కెలోకి క‌న్వ‌ర్ట్ చేశాక మ‌రింత గ్రాండ్ లుక్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఈ విష‌యం బ‌య‌టికి రావ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ నెట్టింట హంగామా చేయ‌డం మొద‌లు పెట్టారు. అంతే కాకుండా ఈ మూవీ రీ రీలీజ్ లో `పోకిరి`ని రీరిలీజ్ రికార్డ్స్ ని కొట్టాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందు కోసం గీతా ఆర్ట్స్ నుంచి పెద్ద టీమే రంగంలోకి దిగిన‌ట్టుగా చెబుతున్నారు. ఏకంగా 500 షోలు ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీన్ని బ‌ట్టి `పోకిరి` రికార్డ్స్ స్మాష్ కావ‌డం ఖాయం అని తెలుస్తోంది.
Tags:    

Similar News