అంచ‌నాలే నిజం..వ‌ర్మ‌పై కోర్టులో కేసు

Update: 2017-07-25 14:30 GMT
ట్వీట్లతో స్ట‌న్‌ చేయ‌డం రాంగోపాల్‌ వ‌ర్మ స్ట‌యిల్‌. అందుకే స‌మాజంలో జ‌రిగిన ప్ర‌తి విష‌యంపై త‌న దైన స్టైల్ లో కామెంట్స్ చేస్తుంటాడు. ఇదే రీతిలో డ్ర‌గ్స్ కుంభ‌కోణంకి సంబంధించి ఫేస్ బుక్ లో వ‌ర్మ కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. కాలేజీ విద్యార్థులను విచారిస్తారా, అకున్ సబర్వాల్‌ తో రాజమౌళి బాహుబలి-3 తీస్తారేమో అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రముఖ రచయిత సిరాశ్రీ రాసిన‌ కవితను కూడా దర్శకుడు వర్మ పోస్ట్ చేశాడు. సంచ‌ల‌నం రేపిన డ్ర‌గ్స్ కేసుపై తాజాగా వ‌ర్మ పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ కామెంట్ వివాదాస్ప‌దంగా మారింది.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కేసు న‌మోదు అవుతుంద‌ని ప‌లువురు అంచ‌నా వేశారు. అది నిజం అయింది. తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టులో రంగ‌ప్ర‌సాద్ అనే న్యాయ‌వాది కేసు న‌మోదు చేశారు. డ్ర‌గ్స్ దందా తాట తీస్తున్న పోలీసుల‌పై వ‌ర్మ వెట‌కారంగా చేసిన పోస్ట్ అది సోష‌ల్ మీడియాలో నెగ‌టివ్ సందేశాన్ని ఇస్తోంద‌ని అందుకే తాను పిటిష‌న్ వేశాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. డ్రగ్స్‌ కేసుతో వర్మకు సంబంధం లేదని, అయినా ఎక్సైజ్ అధికారులను కించపరిచే విధంగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వర్మ వ్యాఖ్యలు చేశారని రంగప్రసాద్‌ తెలిపారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్మ సందేహాలు మ‌రి ఎత్తిపొడుపుగా ఉన్నాయ‌ని రంగ‌ప్ర‌సాద్ అన్నారు. చిన్న‌పిల్ల‌ల‌ను, డ్ర‌గ్స్ తీసుకునే వారికి వ‌ర్మ ఒకే గాట‌న క‌ట్టార‌ని అన్నారు. మైన‌ర్లు, మేజ‌ర్ల‌కు మ‌న‌దేశంలో వేర్వేరు చ‌ట్టాలు ఉంటాయ‌నే విష‌యం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిగా చెప్పుకొనే వ‌ర్మ‌కు తెలియ‌దా అని న్యాయ‌వాది ప్ర‌శ్నించారు. అత్యంత గోప్యంగా సాగుతున్న మాద‌క ద్ర‌వ్యాల వినియోగాన్ని పోలీసులు చాలా చాక‌చ‌క్యంగా ఛేధించిన క్ర‌మంలో వారి మ‌నోస్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు.

కాగా వ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై సినీ సెల‌బ్రిటీల‌తో పాటు ఎక్సైజ్ అధికారులు మండి ప‌డుతున్నారు. అధికారుల మ‌నోస్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా వ‌ర్మ వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు అని ఎన్ ఫోర్స్ మెంట్ ఎక్సైజ్ క‌మీష‌న‌ర్ అన్నారు. ఇక తాజాగా మా అధ్య‌క్షుడు శివాజీ రాజా కూడా వ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేం లేదని, ఆయ‌న‌ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవ‌రెన్ని అబ‌ద్ధాలు మాట్లాడిన అవి నిజాలు కావు, నిర్ధోషులుగా ఉన్న వారిని దోషులుగా ఎవ‌రు నిరూపించ‌లేర‌ని అన్నాడు. ఈ కేసులో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై అకున్ స‌బ‌ర్వాల్ ద‌గ్గ‌రే పూర్తి క్లారిటీ ఉంద‌ని శివాజీ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News