లోహిత తో 'Rx100' హీరో పదేళ్ల ప్రేమాయణం..!

Update: 2021-08-24 05:40 GMT
'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ.. పదేళ్ల ప్రేమాయణం వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న 'Rx100' హీరో.. సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ హోటల్‌ లో అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో కార్తికేయ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో యువ హీరో చేసుకోయే అమ్మాయి ఎవరని ఆరా తీయడం మొదలు పెట్టారు. కొందరు పెద్దలు కుదిర్చిన సంబంధం అంటుంటే.. మరికొందరు లవ్ మ్యారేజ్ అని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో కార్తికేయ ట్విట్టర్ వేదికగా తన దశాబ్ద ప్రేమాయణం గురించి వెల్లడించారు.

తన నిశ్చితార్థంపై స్పందించిన కార్తికేయ.. కాబోయే భార్యను పరిచయం చేస్తూ ట్విట్టర్ లో పాత - కొత్త ఫోటోలను షేర్ చేశారు. 2010లో నిట్ వరంగల్ లో చదువుకునే రోజుల నుంచి స్నేహితురాలిగా ఉన్న లోహిత రెడ్డి ని వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ''2010లో నిట్‌ వరంగల్‌ లో తొలిసారి లోహితను కలిశాను. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది'' అని కార్తికేయ పేర్కొన్నాడు.

లోహిత‌తో కాలేజీ రోజుల్లో దిగిన పాత ఫొటోను - ఇప్పుడు ఎంగేజ్మెంట్ సంద‌ర్భంగా దిగిన కొత్త ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుని దశాబ్దకాలం మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్తికేయ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నందుకు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. 'Rx 100' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కార్తికేయ.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రస్తుతం 'రాజా విక్రమార్క' చిత్రం చేస్తున్నారు. హీరోగా మాత్రమే సినిమాలు చేయాలని ఫిక్స్ అవకుండా.. తనలోని నటుడిని బయటకు తీయడానికి అవకాశం వచ్చినప్పుడు విలన్ పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు. 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించిన కార్తికేయ.. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న 'వాలిమై' సినిమాలో కూడా కార్తికేయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.
Tags:    

Similar News