ఒక ‘స్వరం’ శాశ్వితంగా వెళ్లిపోయింది

Update: 2015-07-16 04:38 GMT
సంగీతాభిమానుల శోకం తీరేలా లేదు. రెండు రోజుల క్రితం స్వరాల సృష్టికర్త ఎంఎస్ విశ్వనాథన్ మరణం నుంచి కోలుకోకమందే మరో స్వరం స్వర్గస్తులు కావటం షాక్ కలిగించేదే. ప్రముఖ గాయకులు రామకృష్ణ స్వర్గస్తులయ్యారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆయన.. జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి కాలనీలో తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

దాదాపు 200 సినిమాల్లోనూ.. 5 వేల భక్తి గీతాలు ఆలపించిన రామకృష్ణ విలక్షణ గాయకుడిగా పేర్కొందారు. 1947 ఆగస్టు 20న జన్మించిన ఆయన.. ఆకాశవాణిలో లలిత గీతాల్ని పాడటంతో తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. ముత్యాల ముగ్గు.. అందాల రాముడు.. శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర.. దాన వీర శూర కర్ణ లాంటి ఎన్నో సినిమాల్లోఆయన పాటలు పాడారు. ఆయనకు ఒక కుమారుడు.. కుమార్తె ఉన్నారు. కుమారుడు సాయి కిరణ్.. నువ్వేకావాలి సినిమాతో వెండి తెరకు పరిచయమై.. పలు సినిమాల్లో నటించారు. ప్రముఖ గాయని పి. సుశీల.. రామకృష్ణకు మేనత్త.

అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తితో చిత్రరంగంలోకి వచ్చిన ఆయన పౌరాణిక చిత్రాల్లో గాయకుడిగా మంచి పేరు ప్రఖ్యతులు సంపాదించుకున్నారు. అలనాటి మేటి హీరోలు ఎన్టీఆర్.. ఏ ఎన్నార్.. శోభన్ బాబు నటించిన చిత్రాల్లో ఆయన గాయకుడగా వ్యవహరించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సినిమా రంగానికి చెందిన ఇద్దరు సంగీత ప్రముఖులు కన్నుమూయటం సంగీతాభిమానుల్ని వేదనకు గురి చేస్తోంది.
Tags:    

Similar News