రేట్లు పెంచేసిన కియారా - పూజాహెగ్డేలు

Update: 2020-03-18 23:30 GMT
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కాల్షీట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సీజన్ లో రిలీజైన 'అల వైకుంఠపురంలో' చిత్రంతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. మరోవైపు గత కొంతకాలంగా బాలీవుడ్ లో కూడా పాగా వెయ్యాలని ప్రయత్నిస్తున్న పూజాహెగ్డేకి మొదట్లో నిరాశే ఎదురైంది. హృతిక్ రోషన్ సరసన నటించిన 'మొహంజదారో' సినిమా ఘోర పరాజయం పాలైంది. అయినా పట్టు వదలకుండా అవకాశం వచ్చేదాకా వెయిట్ చేసి హౌస్ ఫుల్-4 మూవీతో సక్సెస్ చవిచూసింది. ఈ సినిమా విజయంతో మంచి ఊపు మీదున్న ఈ అమ్మడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్ తో ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని నడియద్ వాలా గ్రాండ్‌ సన్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ (ఎన్‌ జీఈఎఫ్‌) సంస్థ నిర్మిస్తుంది.

అయితే ఈ చిత్రానికి ఆమెకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. టాలీవుడ్ లో దాదాపు యువ కథానాయకులందరితో నటించిన పూజాహెగ్డే అల వైకుంఠపురంలో చిత్రం కోసం దాదాపు రెండు కోట్ల వరకు తీసుకుంది. ఈ సినిమా విజయంతో తన రేట్ ను రెండున్నర కోట్లకు పెంచింది.  ఇక సల్మాన్ ఖాన్ సినిమా హిట్ అయితే పూజా ఎంత డిమాండ్ చేస్తుందో అంటూ టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఆమె ప్రస్తుతం ప్రభాస్ సరసన 'ఓ డియర్' (పేరు పరిశీలనలో ఉంది), అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్' సినిమాలలో నటిస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సమ్మర్ లో - ప్రభాస్ సినిమా అక్టోబర్ లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. కరోనా ఇబ్బంది తొలగకపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ వాయిదా పడే అవకాశం ఉంది.

మరోవైపు అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లలో ముందువరుసలో ఉండే మరో హీరోయిన్ కియారా అద్వానీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన 'ధోనీ' భామ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వచ్చిన 'వినయ విధేయ రామ' చిత్రం ప్లాప్ అయినా తనకు మాత్రం మంచి రెమ్యూనరేషన్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం 'గిల్టీ'తో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఒక ఊపు ఊపుతున్న కియారా తెలుగులో ఒక పెద్ద హీరోతో నటిస్తున్నారని సమాచారం. ఏ చిత్రానికి కియారా భారీ మొత్తాన్నే డిమాండ్ చేస్తుందంట. ఏది ఏమైనా హీరోయిన్లు తీసుకునే పారితోషకాలు సినిమా నిర్మాణానికి భారంగా మారకుండా ఉంటే మంచిదే.


Tags:    

Similar News