హాట్ టాపిక్ గా పవర్ స్టార్ కొత్త కండీషన్..?

Update: 2022-01-24 05:22 GMT
పవన్ మూవీ వస్తుందంటే.. ఆయన్ను అభిమానించే అశేష అభిమానులకు పండుగే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అదో జాతరగా మారుతుందని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న ఇమేజ్ ఎంతన్న విషయాన్ని వకీల్ సాబ్ ఫ్రూవ్ చేసింది. కరోనా సెకండ్ వేవ్ వేళ విడుదలైన ఆయన మూవీని మొదటి రోజు థియేటర్లలో చూసేందుకు.. చంటి బిడ్డల్ని చంకల్లో పెట్టుకొని మరీ థియేటర్ కు వచ్చిన తీరు హాట్ టాపిక్ గా మారింది. కేసులు భారీగా పెరిగినప్పటికీ ఆయన సినిమాను వెండితెర మీద చూసేందుకు చూపించిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ గా ఎందుకు అంటారో.. వకీల్ సాబ్ విడుదల వేళ కనిపించిన సీన్లు చూసిన వాళ్లందరికి అర్థమైన పరిస్థితి.

అలాంటి పవన్ నుంచి సినిమా వస్తుందంటే.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే.. ఈపాటికి భీమ్లా నాయక్ థియేటర్లలో సందడి చేయటమే కాదు.. దాని కలెక్షన్ లెక్కలపై జోరుగా వార్తలు వస్తుండేవి. జక్కన్న ఆర్ఆర్ఆర్ కోసం విడుదలను త్యాగం చేయటం.. ఇప్పుడున్న కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ఫిబ్రవరిలో చెప్పిన తేదీకి మూవీ విడుదల అవుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. తాను చేయాల్సిన సినిమాల విషయంలో పవన్ కొత్త కండీషన్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఆయన కమిట్ అయిన చిత్రాల లెక్కను చూస్తే.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ బ్యాలెన్సు షూట్ ను ఫిబ్రవరిలో షురూ చేస్తారని చెబుతారు. ఈ మూవీ తర్వాత హరీశ్ శంకర్ రతో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత సురేంద్ర రెడ్డి సినిమా లైన్ లో ఉంది. అయితే.. ఈ రెండు సినిమాల విషయంలో ఆయా చిత్రాల దర్శక నిర్మాతలకు పవన్ కొత్త కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇక.. తాను చేసే సినిమాలకు 60రోజుల కాల్షీట్లు మాత్రమే ఇస్తానని.. అంతకు మించి ఇవ్వలేనని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఏం చేసినా.. తాను ఇచ్చిన 60 రోజుల్లోనే తన షూటింగ్ పార్టును ముగించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. దర్శక నిర్మాతలకు ఉరుకులుపరుగులు తప్పవంటున్నారు. పవన్ లాంటి పెద్ద హీరోతో షూట్ అంటే.. ఆయనతో పాటు నటించే నటీనటుల జాబితా భారీగా ఉంటుంది. వారందరిని.. పవన్ కు సెట్ అయ్యే డేట్లకు  ఫిక్స్ చేయటం.. ఆయన ఇచ్చిన పరిమిత సమయంలో షూటింగ్ పూర్తి చేయటం కత్తి మీద సాముగా చెబుతున్నారు.

ఉన్నట్లుండి.. పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికి కారణం లేకపోలేదని చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి రెండు నెలల్లో  క్రిష్ మూవీని పూర్తి చేసి.. ఆ తర్వాత మిగిలిన రెండు సినిమాల్ని 2022 చివరకు పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. 2023 మొత్తం ఏపీ రాజకీయాల్లోనే ఆయన తలమునకలై ఉంటారని తెలుస్తోంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఆయనకు కీలకం కావటంతో.. గతంలో మాదిరి కాకుండా.. ఏడాదిన్న ముందు నుంచే పక్కా ప్లానింగ్ తో పూర్తిగా రాజకీయాల్లోనే నిమిగ్నమై ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఆయన ప్లానింగ్ ప్రకారం.. 2023లో ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. ఫ్యాన్స్ కు పండుగేనని చెప్పాలి. ఎందుకంటే.. మూడో వేవ్ ఒక కొలిక్కి వచ్చినంతనే భీమ్లానాయక్.. ఈ ఏడాది చివర్లో క్రిష్ మూవీ విడుదలైతే.. వచ్చే ఏడాది రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఏడాదికి ఒక్క సినిమా విడుదలైతే చాలు.. అదే పది వేలు అనుకునే పవన్ ఫ్యాన్స్ కు.. ఏడాదికి రెండు సినిమాల చొప్పున అంటే.. అంతకు మించిన పండుగ వార్త వారికేం ఉంటుంది చెప్పండి.
Tags:    

Similar News