అక్క‌డ ప్ర‌భాస్ 'బాహుబ‌లి 2' రికార్డ్స్ సేఫ్

Update: 2022-03-27 01:30 GMT
ద‌క్షిణాది సినిమాల‌కు ఉత్త‌రాదిలో పెద్ద‌గా ప్రాధాన్య‌త వుండేది కాదు. ద‌క్షిణాది సినిమా అంటే ప్రేక్ష‌కుల‌తో పాటు మేక‌ర్స్ కూడా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. అయితే 'బాహుబ‌లి' త‌రువాత సీన్ మారింది. మ‌న సినిమాల‌కు అక్క‌డ మార్కెట్ పెరిగింది. ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని మొద‌లైంది. దీంతో ద‌క్షిణాది చిత్రాలు ఉత్త‌రాదిలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం మొద‌లైంది. సినిమాలు థియేట‌ర్లే ల‌భించ‌ని స్థాయి నుంచి 100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టే స్థాయికి చేరుకున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌రాదిలో భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన టాప్ 10 సినిమాల గురించి చూద్దాం. ప్ర‌భాస్ ని పార‌న్ ఇండియా స్టార్ ని చేసిన 'బాహుబ‌లి 2' హిందీలో విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టించింది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం 2017లో విడుద‌లై మొద‌టి రోజు 40 కోట్లు వ‌సూలు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఉత్త‌రాదిలో అత్య‌ధిక ప్రారంభ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన తొలి చిత్రంతో 'బాహుబ‌లి 2' రికార్డు సాధించింది. ఆ రికార్డు ఇప్ప‌టికీ సేఫ్‌గానే వుంది.  

తాజాగా విడుద‌లైన ట్రిపుల్ ఆర్ హిందీ వెర్ష‌న్ ప్రారంభ వ‌సూళ్లు 25 కోట్లు. రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ న‌టించిన ఈ చిత్రానికి రాజ‌మౌళి క్రేజ్ తోడ‌వ్వ‌డం వ‌ల్లే ఈ స్థాయి ఓపెనింగ్స్ ని అక్క‌డ సాధించింది. దీంతో 'సాహో' రికార్డుని ఈ మూవీ అక్క‌డ అధిగ‌మించేసింది. 'సాహో' తొలి రోజు 24 కోట్లు వ‌సూలు చేసి ఆశ్చ‌ర్య ప‌రిచింది.'బాహుబ‌లి' త‌రువాత ప్ర‌భాస్ చేసిన సినిమా కావ‌డంతో దాని ప్ర‌భావం ఈ సినిమాపై ప‌డ‌టం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని చెబుతారు.

ఇక ఈ చిత్రాల త‌రువాత స్థానంలో నిలిచిన మూవీ '2.O'. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన ఈ చిత్రం అక్ష‌య్ కుమార్ కార‌ణంగా తొలి రోజు19 కోట్లు వ‌సూలు చేసింది. ఇక 2015లో వ‌చ్చిన 'బాహుబ‌లి ది బిగినింగ్‌' మొద‌టి రోజు 5.15 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇదే బాలీవుడ్ వ‌ద్ద ద‌క్షిణాది చిత్రాల‌కు బాట‌లు వేసింది. అయితే ప్ర‌భాస్ క్రేజ్ 'రాధేశ్యామ్‌' విష‌యంలో వ‌ర్క‌వుట్ కాలేదు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ మూవీ హిదీ బెల్ట్ లో పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. కేవ‌లం 4.50 కోట్ల‌తో మాత్ర‌మే స‌రిపెట్టుకుంది.

ఇదే వ‌రుస‌లో విడుద‌లైన రామ్ చ‌ర‌ణ్ 'జంజీర్' 3.58 కోట్లు, ర‌జ‌నీకాంత్ 'క‌బాలి' 3.50 కోట్లు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప‌' 3.31 కోట్లు ( ఎలాంటి ప్ర‌చారం చేయ‌కుండానే), మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'సైరా న‌రసింహారెడ్డి' 2.60 కోట్లు వ‌సూలు చేశాయి.

అయితే ఇందులో ఫుల్ ర‌న్ లో బ‌న్నీ న‌టించిన 'పుష్ప‌' ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లేకుండానే 100 కోట్ల‌కు మించి హిందీ బెల్ట్ లో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం రికార్డుగా నిలిచింది.
Tags:    

Similar News