బాహుబలి కోసం అతణ్ని రంగంలోకి దించారు

Update: 2017-04-05 09:23 GMT
ప్రస్తుతం దేశమంతా ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ విషయంలో దక్షిణాది వాళ్లు.. ఉత్తరాది వాళ్లు అన్న తేడాలేమీ లేవు. అందరిలోనూ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న ఆతృత ఉంది. కన్నడ ప్రేక్షకుల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. మూమూలుగానే తెలుగు సినిమాలపై విపరీతమైన అభిమానం చూపించే కన్నడ ప్రేక్షకులు.. ‘బాహుబలి: ది బిగినింగ్’ను విరగబడి చూశారు. అక్కడి స్ట్రెయిట్ సినిమాల కంటే కూడా ఈ సినిమా చాలా బాగా ఆడింది. మన తెలుగు ప్రేక్షకుల్లాగే టికెట్ల కోసం కొట్టుకోవడాలు.. థియేటర్ల మీద దాడులు చేయడాలు లాంటి దృశ్యాలు కనిపించాయి కన్నడ రాష్ట్రంలో.

అలాంటిది ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా మాకొద్దు అంటూ గొడవ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. కావేరి జలాల వివాదానికి సంబంధించి తమిళ నటుడు సత్యరాజ్ ఇంతకుముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుక్కారణం. ఆయన కీలక పాత్ర పోషించిన ‘బాహుబలి’ మాకొద్దు అంటున్నారు కన్నడిగులు. ‘బాహుబలి’కి వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు కూడా జరిగాయి. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు కూడా ముందుకు రాని పరిస్థితి. ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్నా సరే.. సినిమాను ఎలా విడుదల చేయాలన్నదే అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కర్ణాటక ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రంజిత్ రెడ్డిని రంగంలోకి దించారు. అతను కన్నడిగులకు విన్నపాలు చేసుకుంటున్నాడు. సత్యరాజ్ వ్యాఖ్యల్ని తాము కూడా ఖండిస్తున్నామని.. కానీ ఆయన మీద వ్యతిరేకతతో ‘బాహుబలి’ సినిమాను అడ్డుకోవడం కరెక్ట్ కాదని అతన్నాడు. మన దేశం గర్వించదగ్గ సినిమా అయిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు సహకరించాలని.. ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని పరిగణనలోకి తీసుకోవాలని అతను కోరాడు. మరి కన్నడిగుల మనసు కరిగి ‘బాహుబలి-2’ విడుదలకు సహకరిస్తాడేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News