30 రోజుల్లో యాంక‌ర్ ప్రేమాయ‌ణం

Update: 2020-01-27 01:30 GMT
యాంక‌ర్లు హీరోలు అవ్వ‌డం కొత్తేమీ కాదు. అయితే హీరోలుగా స‌క్సెస్ అయిన‌వాళ్ల‌ను చూపించ‌లేం. ర‌వి- ప్ర‌భాక‌ర్- నందు- సుడిగాలి సుధీర్ ఇలా పలువురు యాంక‌ర్లుగా కెరీర్ ప్రారంభించి హీరోలు అయ్యారు. కానీ స‌క్సెస్ అన్న‌దే చిక్క‌లేదు. మ‌రి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి హీరోగా ఎదిగే సీన్ ఎవ‌రికైనా ఉందా?

క‌నీసం ప్ర‌దీప్ మాచిరాజు అయినా ఆ సెంటిమెంటును బ్రేక్ చేస్తాడా? అంటే ప‌్ర‌స్తుతానికి  స‌స్పెన్స్. యాంకర్ గా కొనసాగుతూనే సినిమా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నాడు ప్ర‌దీప్. స‌హాయ‌క పాత్ర‌ల్లో రాణించాడు. తాజాగా హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`  అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్  పోస్ట‌ర్ ని టాలీవుడ్ హంక్ రానా చేతుల మీదుగా విడుద‌ల చేసారు. ప్ర‌దీప్ హీరోగాను స‌క్సెస్ అవ్వాల‌ని రానా ఈ సంద‌ర్భంగా ఆకాంక్షించారు. లుక్ లాంచ్ కి సంబంధించిన వీడియోను ప్ర‌దీప్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్ లో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అయ్యింది. ``సెల‌యేటి మ‌ధ్య‌లో  ఆ పూల ప‌రిమ‌ళం..నీ నీలి క‌ళ్ల‌లో నా ప్రేమ మ‌ధురం... 30 రోజుల్లో ప్రేమించటం ఎలా!`` అంటూ ఓ కవితను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తామ‌ని తెలిపాడు. ఈ చిత్రానికి మున్నా అనే కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. న‌ట‌న ప్ర‌దీప్ కు కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో న‌టించాడు. అయితే అవ‌న్నీ ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర‌లే. దీంతో పూర్తి స్థాయిలో త‌న‌ని తాను నిరూపించుకునే  అవ‌కాశం రాలేదు. తొలిసారి హీరోగా న‌టిస్తున్నాడు కాబ‌ట్టి వైవిధ్యం చూపిస్తూ రొటీనిటీకి భిన్నంగా తానేంటో చూపించాల్సి ఉంటుంది. త‌మిళంలో బుల్లితెర నుంచి వెండితెర‌పై అడుగు పెట్టి అసాధార‌ణంగా ఎదిగిన ఆర్.మాధ‌వ‌న్ లాంటి స్టార్ ప్ర‌దీప్ కి స్ఫూర్తిగా నిల‌వాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యాంక‌ర్ గా పీక్స్ ని చూపించిన ప్ర‌దీప్ ఇత‌ర యాంక‌ర్ల‌తో పోలిస్తే తాను యూనిక్ అని నిరూపిస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News