పోగొట్టుకున్న చోటనే రాబట్టి చూపించు

Update: 2015-07-05 08:23 GMT
వారసత్వం, బ్యాకప్‌ ఉంటేనే సరిపోదు. సిసలైన క్రియేటివిటీ ఉంటేనే టాలీవుడ్‌లో నిలబడేది. లేదంటే బ్యాక్‌ టు పెవిలియన్‌ అంటూ ఇంటిమొహం పట్టాల్సిందే. ఇప్పటికే కృష్ణానగర్‌, ఫిలింనగర్‌ ఖాళీ అయిపోయింది. డైరెక్టర్‌ అయ్యి క్రియేటివిటీ చూపించాలని, కోటీశ్వరులవ్వాలని కలలుగన్న యువతరానికి సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక్కో నిజం చేదుగా తగుల్తున్నాయి.

ఇక్కడ వారసత్వం, బోలెడంత బ్యాకప్‌ ఉండీ ఏం పీకలేపోకపోతున్నారన్న వాస్తవాన్ని తెలుసుకుంటున్నారు. అందుకే కొందరు ఏళ్లకొద్దీ మేట వేసి ప్రయత్నించి చివరికి విఫలమై వెనక్కి వెళ్లిపోతున్నవాళ్లు ఉన్నారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో నెలకొన్న క్రైసిస్‌తో దాదాపు డైరెక్టర్లు అవ్వాలనుకున్నవాళ్లంతా వేరే ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. అయితే వీళ్లందరికీ ప్రకాష్‌ కోవెలమూడి ఇన్‌స్పిరేషన్‌ ఇస్తాడా? ఇవ్వడా? అన్న ఆసక్తికర చర్చ ఫిలింనగర్‌లో సాగుతోందిప్పుడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు లాంటి లెజెండరీకి తనయుడిగా సినీరంగంలో సునాయాసంగా ప్రవేశించిన ప్రకాష్‌ తొలి సినిమాతో విజయం అందుకోలేక చతికిలబడ్డాడు. అనగనగా ఓ ధీరుడు ఫ్లాపవ్వడంతో బోలెడన్ని విమర్శల్ని ఎదుర్కొన్నాడు. తండ్రి పేరు చెడగొట్టాడన్న విమర్శలూ వచ్చాయి.

అయితే పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని.. అతడు ఎంతగానో శ్రమిస్తున్నాడు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అతడి భార్య కనిక థిల్లాన్‌ అందించిన స్క్రిప్టుతో సైజ్‌ జీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనుష్క ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కమర్షియల్‌ డైరెక్టర్‌గా నిరూపించుకుని తండ్రి గౌరవాన్ని టాలీవుడ్‌లో రెట్టింపు చేయాలని కోరుకుందాం.

Tags:    

Similar News