సంపదల్ని సృష్టించు. సంపదల్ని ఎంజాయ్ చెయ్. సంపదల్ని పంచిపెట్టు .. ఇదీ ప్రకాష్ రాజ్ ఫిలాసఫీ. సమాజం మనకి ఇచ్చినప్పుడు తిరిగి సమాజానికి మనం కూడా ఇవ్వాలి కదా! ఈ ప్రిన్సిపల్ కి కూడా కట్టుబడి ఉన్నాడు ఈ విలక్షణ నటుడు. కావాల్సినంత సంపాదించా. ఇక సమాజానికి ఏదైనా చేయాలి. సమాజం వల్లే వచ్చింది. తిరిగి సమాజానికే ఇచ్చేయాలి.. అదే నా సిద్ధాంతం అని చెబుతున్నాడు.
వెండితెర పైనే విలనీ, రియల్ లైఫ్ లో కాదని ఆచరణలో చెబుతున్నాడు. అతడు సదుద్ధేశం ఉన్న మంచి మనిషి. అందుకే అతడు కూడా చాలా కాలంగా సామాజిక సేవలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ పేరుతో ఇప్పటికే కర్నాటక, తమిళనాడులో బోలెడన్ని సేవాకార్యక్రమాలు చేశాడు. ఇక నుంచి అతడి దృష్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణపైనా పడింది. ఏ ముహూర్తాన శ్రీమంతుడు రిలీజైందో ఒకరొకరుగా సెలబ్రిటీలంతా ఊళ్లను దత్తత తీసుకునే పనిలో పడ్డారు. ఆ పనిలో భాగంగా ఇప్పటికే మహేష్, మంచు విష్ణు వంటి హీరోలు ఊళ్లను దత్తత తీసుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వంతు వచ్చింది. అతడు త్వరలోనే ఏపీకి చెందిన ఓ గ్రామాన్ని, తెలంగాణకు చెందిన ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్నాడు. ఇప్పటికైతే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట్ మండలంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు సుముఖంగా ఉన్నాడు.
పంటల్ని మెరుగైన పద్ధతుల్లో పండించడం ఎలా? అందుకు ట్రాక్టర్లు కావాలన్నా, సైంటిఫిక్ మెదడ్స్ పై సలహాలు కావాలన్నా.. తనవంతుగా సాయం చేయనున్నానని చెప్పాడు. ఇంకా గ్రామాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. ఈలోగానే ఏపీలోనూ ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకునేందుకు పర్యటనలో ఉన్నానని చెప్పాడు ప్రకాష్ రాజ్. శభాష్ రాజా.. నువ్వు అందరికీ ఆదర్శం.