MAA వార్: నేను మోనార్క్ ని.. ఎవ‌రి మాటా విన‌ను..!

Update: 2021-09-15 03:40 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా దాని చుట్టూ ర‌స‌వ‌త్త‌ర డ్రామా న‌డ‌వ‌డం ప‌రిపాటిగా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చిందంటే ఆర్టిస్ట్ లు రాజ‌కీయ నాయ‌కుల్లా మారి ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాల‌ని సంధించుకోవ‌డం.. వార్త‌ల్లో నిల‌వ‌డం తెలిసిందే. తాజాగా అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న `మా` ఎన్నిక‌లు కూడా రాజ‌కీయ ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తూ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సారి మా అధ్య‌క్ష పోటీలో సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాష్ రాజ్.. మంచు విష్ణు.. సీవీఎల్ న‌ర‌సింహారావు వున్నారు.  

అయితే ఈ ముగ్గురిలో ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ వేగాన్ని పెంచి ప్ర‌చారం మొద‌లుపెట్టింది. ఈ సంద‌ర్భంగా విందు రాజ‌కీయాలు తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఎల‌క్ష‌న్స్ లో ఏ లీడ‌రో ఏ ప్యాన‌లో గెల‌వ‌దు.. ఓడిపోదు. మెంబ‌ర్స్ క‌రెక్ట్ గా వుంటే మీరు గెలుస్తారు. స‌రైన వారిని ఎన్నుకోక‌పోతే మీరే ఓడిపోతారు. ఇది ఏదో యుద్ధం కాదు.. స‌మ‌రం అంత‌క‌న్నా కాదు ప‌ట్టుబ‌డి వుండ‌టానికి.. ఇవి ఎన్నిక‌లు.. ఇక్క‌డ‌ మెంబ‌ర్స్ మాత్ర‌మే వుంటారు. అంద‌రూ మంచి చేయాల‌నే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారు కానీ ర‌క‌ర‌కాల కార‌ణావ‌ల్ల చేయ‌లేక‌పోతున్నారు. ఇందుకు ఎన్నుకునే ప్ర‌క్రియే స‌రిగ్గా లేదు. దాని వ‌ల్లే ఇద్దంతా జ‌రుగుతోంది.

``నేను పెరిగిన ప‌రిస్థితులు వేరు. నేను ఆశ్ర‌మంలో పెరిగాను. నాకు క‌ష్టాలు తెలుసు. బాధ‌లు తెలుసు కాబ‌ట్టే ఎన్నిక‌ల్లో దిగాను. మా అసోసియేష‌న్ ను ఓ చారిటీ అసోసియేష‌న్ ని చేసేశాం. చావుబ్ర‌తుకుల్లో వున్న‌ప్పుడు ఆదుకోవాలి.. ప‌దివేలు ఇచ్చారు. బియ్యం ఇచ్చారు అన్న‌ది కాదు మా అసోసియేష‌న్ అంటే వ్య‌క్తుల‌ను బ‌ల‌ప‌రిచేలా ఎద‌గ‌నిచ్చేలా వుండాలి. ఈ విష‌యంలో నేను ఎవ‌రి మాట విన‌ను`` అన్నారు ప్ర‌కాష్ రాజ్‌.  

విందు రాజ‌కీయాల‌తో హీట్

మావీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో స‌న్నివేశం ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించుకునే ప్ర‌క్రియ‌లో భాగంగా ఎవ‌రికి వారు స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. లంచ్ పార్టీలు.. డిన్న‌ర్ పార్టీలు.. అంటూ మెంబ‌ర్ల ను పార్టీల‌తో ముంచేస్తున్నారు. ప్ర‌ధానంగా పోటీ ప్ర‌కాష్ రాజ్- మంచు విష్ణు ప్యాన‌ల్ మ‌ధ్య నెల‌కొన‌డంతో ఏ వ‌ర్గానికి ఆ వ‌ర్గం మెంబ‌ర్ల‌ను ఆక‌ర్షించుకునే ప‌నిలో బిజీ అయ్యారు. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ జేఆర్ సీ క‌న్వెన్ష‌న్ లో మెంబ‌ర్లంద‌రికీ శ‌నివారం గ్రాండ్ గా లంచ్ పార్టీ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా స‌భ్యులంద‌రితో ఇంట‌రాక్ట్ అయ్యారు. దాదాపు 100 మంది వ‌ర‌కూ ఈ విందుకు హాజ‌రైన‌ట్లు తెలిసింది.

లంచ్ అనంత‌రం `మా` సంక్షేమాల‌పై చ‌ర్చించి.. ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అన్నదానిపైనా ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. 10 కోట్ల కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు చేస్తాన‌ని విల‌క్ష‌ణ న‌టుడు హామీ కూడా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు కూడా స్పీడ్ పెంచిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా విష్ణు  కూడా మంగ‌ళ‌వారం పార్క్ హ‌య‌త్ లో మెంబ‌ర్ల‌కు డిన్న‌ర్ పార్టీ ఏర్పాటు చేసారు. పార్క్ హ‌య‌త్ వేదిక‌గా విష్ణు కూడా మంత‌నాలు మొద‌లున‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. రోజంతా మెంబ‌ర్లు ఆ హ‌డావుడిలోనే పార్క్ హ‌య‌త్ లో బిజీగా గ‌డిపారు. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ సూచ‌న ప్రాయంగా త‌న ఎజెండాను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మంచు విష్ణు కూడా నేటి భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చార‌మైంది.

ఇటీవ‌లే `మా ` భ‌వ‌నం సొంత ఖ‌ర్చుతో నిర్మిస్తాన‌ని విష్ణు హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో అసోసియేష‌న్ సంక్షేమం కోసం త‌న మ్యానిఫేస్టోని కూడా రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఈసీ నోటిఫికేష‌న్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.  

ఇంత‌కుముందే న‌రేష్ లంచ్ పార్టీలు ఆ త‌ర‌వాత బ‌రిలో దిగి ప్ర‌కాష్ రాజ్ ఆక‌స్మిక పార్టీ గురించి తెలిసిన‌దే. మొన్న‌టికి మొన్న‌ మ‌రోసారి ప్ర‌కాష్ రాజ్.. విష్ణుల‌ విందు రాజ‌కీయం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.
Tags:    

Similar News