``నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు`` అని బహభాషా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. టాలీవుడ్ - కోలీవుడ్ లలో ప్రకాశ్ రాజ్ ఎన్నో విలక్షణ పాత్రలను అవలీలగా పోషించారు. ప్రకాష్ రాజ్ తప్ప మరెవ్వరూ నటించలేరన్నంతగా కొన్ని పాత్రల్లో ఇమిడిపోయారంటే అతిశయోక్తి కాదు. అయితే, నటనపరంగా ఇంత పాపులర్ అయిన ప్రకాష్ రాజ్ ...తన వైఖరి వల్ల కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. గతంలో `ఆగడు` చిత్ర షూటింగ్ సమయంలో శ్రీనువైట్ల తో ప్రకాష్ రాజ్ కు గొడవ కావడం...ఆ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకోవడం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం....`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ` ఈవెంట్ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
రామ్-అనుపమల కాంబోలో `హలో గురూ ప్రేమకోసమే` చిత్రాన్ని నక్కిన త్రినాధరావు తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చిన్న గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తండ్రి పాత్రను ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అయితే, ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశం విషయంలో అనుపమకు ప్రకాష్ రాజ్ కు మధ్య వాగ్వాదం జరిగిందట. ఆ సీన్ ఇలాచేస్తే బాగుంటుందని అనుపమకు ప్రకాష్ రాజ్ సూచించారని, అయితే తనకు ఆ సీన్లో ఎలా నటించాలో తెలుసని....మీరు చెప్పనవసరం లేదని...అనుపమ మాట్లాడినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, మనస్తాపం చెందిన అనుపమ కన్నీళ్లు పెట్టుకుని అలాగే కుర్చీలో కూర్చుండిపోయిందని టాక్ వస్తోంది. అయితే, ఈ వివాదంలో అనుపమ తప్పు లేదని, డైలాగ్ క్యూ అందుకోవడంలో అనుపమ తడబడడంతో ప్రకాష్ రాజ్ గట్టిగా చెప్పారని తెలుస్తోంది. దీంతో, అనుపమ ఎమోషన్ అవడం....ఆ తర్వాత అక్కడ నుంచి ప్రకాష్ రాజ్ వెళ్లిపోవడం....శనివారం షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అవడం...జరిగిపోయాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆ ఘటన నిజమైతే...ఈ వివాదం సద్దుమణిగి...ఆ తండ్రీ కూతుళ్లు కలుస్తారో లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.