దోచుకోడానికి రెడీ అవుతున్న ఓటీటీ...?

Update: 2020-06-05 10:30 GMT
డిజిటల్ వరల్డ్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఓటీటీ పేరుకు తగ్గట్టే 'ఓవర్ ది టాప్' అనిపించుకుంటోంది. అందరూ ఈ ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ కంటెంట్ చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల పుణ్యమా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ కు మామూలు గిరాకీ లేదు. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వెబ్ కంటెంట్ విరగబడి చూసేస్తున్నారు. ప్రస్తుతం మనకి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్, ఎమెక్స్ ప్లేయర్, జీ 5, ఆహా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే వాటన్నిటిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ రంగంలో సత్తా చాటుతున్నదని చెప్పవచ్చు. 4000కు పైగా పట్టణాలు నగరాలలో వీక్షణంతో భారతదేశంలో ఎంతగానో చొచ్చుకు పోయిన అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 200కు పైగా దేశాలలో అందుబాటులో ఉంది. మనదేశంలో ఎంతమంది అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఉన్నారో ఎప్పుడూ వెల్లడించనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 15 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని సమాచారం. వివిధ భారతీయ భాషల్లో వేల కొలదీ సినిమాలు వెబ్ సిరీస్‌ లు అందుబాటులో ఉంచుతూ.. పాత కంటెంట్‌ తో పాటు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ వీక్షకులకు అందిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.129 కాగా సంవత్సరానికి రూ.999గా ఉంది. మిగతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ తో పోలిస్తే ప్రైమ్‌ లో సబ్‌స్క్రిప్షన్ ఫీజు తక్కువ కంటెంట్ ఎక్కువ అని చెప్పొచ్చు.

కాగా లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్స్‌ లో సినిమా విడుదలై చాలా రోజులైపోయింది. ఇక తిరిగి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పలేని పరిస్థితి. థియేటర్స్ ఓపెన్ చేసినా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్‌ కి వస్తారా అనేదీ అనుమానమే. దీన్ని క్యాష్ చేసుకోవాలని భావించిన అమెజాన్ ప్రైమ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న దాదాపు 7 సినిమాలను ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకుంది. దాని కోసం ఇప్పటి వరకు పోటాపోటీగా కొన్ని కోట్లు పెట్టి సినిమాలు కొన్నారు. అంతేకాకుండా కొత్త సినిమాలు విడుదల చేస్తే సబ్ స్క్రిప్షన్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరగనుంది. అయితే సబ్‌స్క్రైబర్లు భారీగా పెరుగుతున్నప్పటికీ ప్రైమ్ కి నెల వారీ సంవత్సవారీ చందాలతో వారు పెట్టిన డబ్బులు వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో 'పే పర్ వ్యూ' పద్ధతిని తేవాలని అమెజాన్ ప్రైమ్ వారు చూస్తున్నట్లు సమాచారం. అంటే సబ్ స్క్రిప్షన్ చార్జెస్ తో పాటు కొన్ని సినిమాలు చూడాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలన్నమాట. ఇప్పటికే యూట్యూబ్‌ లో కొన్ని మూవీస్‌ కు ఇలా స్పెషల్ రేటు పెడుతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేస్తున్న 'క్లైమాక్స్' సినిమాకు 'పే పర్ వ్యూ' పద్ధతిలోనే రూ.100 రేటు నిర్ణయించారు. అయితే ప్రైమ్ వాళ్ళు కూడా ఇదే ఆలోచనలో ఉన్నప్పటికీ ఆర్జీవీ వరల్డ్ రేంజ్ లో కాకుండా తక్కువ మొత్తంలో రేట్ నిర్ణయించాలని భావిస్తున్నారట. ఇప్పటిదాకా కోట్లు ఖర్చు పెట్టిన ఓటీటీ బిజినెస్ వర్కౌట్ అవ్వాలంటే మన పాకెట్ నుండే దండుకోవడం స్టార్ట్ చేయబోతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎప్పటి నుండి 'పే పర్ వ్యూ' పద్ధతి తీసుకురాబోతోందనేది అధికారికంగా ప్రకటించినప్పటికీ త్వరలోనే ఈ విధానం ఇంప్లిమెంట్ చేయబోతున్నారని సమాచారం.
Tags:    

Similar News