'పృథ్వీరాజ్' మినీ రివ్యూ: మేజర్-కమల్ మధ్య నలిగిపోయిన అక్షయ్..!

Update: 2022-06-04 03:28 GMT
ఇటీవల కాలంలో హిందీ సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోతున్నాయి. ఓవైపు సౌత్ సినిమాలు వందల కోట్ల వసూళ్లతో సత్తా చాటుతుంటే.. బాలీవుడ్ చిత్రాలు మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చుకోడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ ఏడాది 'ది కాశ్మీర్ ఫైల్స్' 'భూల్ బులయ్యా 2' చిత్రాలు మాత్రమే మేకర్స్ కు లాభాలు తెచ్చిపెట్టాయి. క్రేజీ కాంబినేషన్లు.. పాపులర్ స్టార్స్ చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ''సామ్రాట్ పృథ్వీరాజ్'' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ''సామ్రాట్ పృథ్వీరాజ్''. 12వ శతాబ్దంలో భారతదేశపు ధైర్యవంతులైన చక్రవర్తుల్లో ఒకరైన పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నిన్న శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. 'మేజర్' మరియు 'విక్రమ్' వంటి రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలాంటి స్పందన తెచ్చుకుందో ఇప్పుడు చూద్దాం!

ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన శౌర్యవంతుడు సామ్రాట్ పృథ్వీరాజ్ (అక్షయ్ కుమార్) ఆధిపత్యం చేలాయించడానికి ఎదురులేని పోరాటానికి సిద్ధమవుతాడు. మరోవైపు మహ్మద్ ఘోరి (మానవ్ విజ్) ఢిల్లీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. పృథ్వీరాజ్ పక్కనే ఉంటూ కుట్రలు పన్నే జైచంద్‌ (అశుతోష్ రాణా) కూడా సింహాసనం పై కన్నేస్తాడు. ఇక పృథ్వీరాజ్ సాహసాలు, వీరత్వానికి ముగ్దురాలైన సంయోగిత (మనూషి చిల్లర్) ఆయనను తప్ప మరొకరిని పెళ్లి చేసుకొనని ప్రతీన పూనుతుంది.

ఢిల్లీని ఆక్రమించుకొనేందుకు 17 సార్లు దండెత్తిన మహ్మద్ ఘోరీని పృథ్వీరాజ్ చౌహాన్ ఎలా ఎదుర్కొన్నాడు? జైచంద్ కు ఎలా బుద్ధి చెప్పాడు? శత్రువులను మట్టుబెట్టి తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఇందులో తనకు ఎవరెవరు తోడుగా నిలిచారు? సంయోగిత ప్రేమ సంగతేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ''సామ్రాట్ పృథ్వీరాజ్'' సినిమా.

చాంద్ బర్డై రచించిన పృథ్వీరాజ్ రాసో అనే అద్భుతమైన ప్రేమకావ్యం ఆధారంగా 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాని రూపొందించారు. చంద్రప్రకాశ్ ద్వివేది దీనికి దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వెండితెర మీద సినిమాగా కాకుండా హిస్టరీ లెక్చరర్ చెప్పిన పాఠంగా మారి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

పృథ్వీరాజ్ చౌహాన్‌ పాత్రలో అక్షయ్ కుమార్‌ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక సామ్రాజ్యాన్ని పాలించే సామ్రాట్ పాత్ర చేస్తున్నప్పటికీ.. మానసికంగా, శారీరకంగా ఉండాల్సిన ధృడత్వం తెర మీద కనిపించలేదని అంటున్నారు. అక్షయ్ - మనూషి చిల్లర్‌ కెమిస్ట్రీ తేలిపోయింది. ఇద్దరి మధ్య వయసు తేడా స్పష్టంగా కనిపించింది. ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపికే ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. మహ్మద్ ఘోరీగా మానవ్ జీ.. జానపద గాయకుడు చాంద్ బర్డాయ్ గా సోనుసూద్.. కన్హా పాత్రలో సంజయ్ దత్ ఫర్వాలేదనిపించారు.

దర్శకుడు పృథ్వీరాజ్ స్క్రిప్టు మీద ఎక్కువ పరిశోధన చేసినట్లు లేదని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. సాంకేతిక విభాగాల పనితీరు కూడా పేలవంగా ఉంది. శంకర్ - ఎసాన్ - లాయ్ సంగీతం మరియు మనుష్ నందన్ అందించిన సినిమాటోగ్రఫీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. గ్రాఫిక్ - వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయి. ఒక భారీ హిస్టారికల్ మూవీని చూస్తున్నామనే ఫీలింగ్ ను కలిగించలేకపోయాయి. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ విలువలకు డోకా లేదు. కాకపోతే స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి ఉండే మంచి చిత్రంగా నిలిచేదని ఆడియన్స్ తీర్పు ఇచ్చారు.

'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా హిందీలో 3550 స్క్రీన్స్.. తెలుగు తమిళంలో 200 స్క్రీన్లు కలుపుకుని మొత్తం 3750 స్క్రీన్‌లలో విడుదల చేయబడింది. అయితే మార్నింగ్ షో కేవలం 20 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ అయింది. ఈ రెస్పాన్స్ ని బట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 11 - 12 కోట్ల మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నారు. అక్షయ్ గత ప్లాప్ చిత్రం 'బచ్చన్ పాండే' సైతం తొలి రోజు 13 కోట్లకు పైగా రాబట్టగలిగింది.

మరోవైపు అడివి శేష్ 'మేజర్' మరియు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. రెండు సౌత్ చిత్రాల దెబ్బకు అక్షయ్ సినిమా వైపు చూసేవాళ్లే కరువయ్యారు. పోయిన వారం రిలీజ్ అయిన 'భూల్ బులయ్యా 2' కంటే ఈ చిత్రానికి చాలా తక్కువ ఆక్యుపెన్సీ ఉండటం గమనార్హం. తొలి రోజు చాలా పూర్ గా ఓపెన్ అయిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' మూవీ.. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.
Tags:    

Similar News