నార్త్‌ నుండి వచ్చినట్లుగా చెప్పుకోమన్నారు

Update: 2018-12-20 01:30 GMT
తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌ లో ఎక్కువ ఛాన్స్‌ లు రావనేది మొన్నటి వరకు ఉన్న  మాట. అయితే చిన్న సినిమాలు తెలుగమ్మాయిలను వెలుగులోకి తీసుకు వస్తున్నాయి. మంచి నటన మరియు అందం ఉన్న తెలుగమ్మాయిలు స్టార్‌ హీరోలతో కూడా నటించే అవకాశాలు దక్కించుకునే అవకాశాలున్నాయి. తాజాగా తెలుగమ్మాయి ప్రియ వడ్లమాని ‘హుషారు’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతకు ముందు రెండు సినిమాల్లో ఈమె నటించినా కూడా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. కాని హుషారు సినిమాతో ఈమెకు కాస్త గుర్తింపు దక్కింది.

ఈ సందర్బంగా ప్రియా వడ్లమాని మీడియాతో మాట్లాడుతూ... తాను మొదట వంశీ పైడిపల్లి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా వ్యవహరించాను. మహర్షి మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ సమయంలో నేను ఆయనతోనే ఉన్నారు. ఆ సమయంలోనే హీరోయిన్‌ గా ఛాన్స్‌ వచ్చింది. దాంతో పూర్తిగా నటనకే ప్రాధాన్యత ఇచ్చానని చెప్పుకొచ్చింది. తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌ లో ఎక్కువ ప్రాముఖ్యత ఉండదని, అందుకు ముంబయి నుండి వచ్చినట్లుగా చెప్పుకో, తెలుగమ్మాయి అనే విషయాన్ని అందరికి చెప్పవద్దని కొందరు సూచించారు. కొందరు తన సర్‌ నేమ్‌ ను మార్చుకోమన్నారు. కాని నేను మాత్రం అవేవి చేయకుండా తెలుగమ్మాయిగా, ప్రియా వడ్లమానిగానే సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్నాను అంది.

హుషారు చిత్ర దర్శకుడు శ్రీహర్ష లాంటి వారు కేవలం తెలుగు అమ్మాయిలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది నా అదృష్టం, అలాంటి వారు ఉన్న కారణంగానే నాకు అవకాశాలు వస్తున్నాయంది. ఇక పాత్ర కోసం  ముద్దు సీన్స్‌, స్మోకింగ్‌ సీన్స్‌ లో నటిస్తానంది. అలా చేసింది నేను కాదు, ఆ సినిమాలోని పాత్ర అనేది తన కుటుంబ సభ్యులకు తెలుసు. అందుకే వారు అలాంటి సీన్స్‌ కు ఎలాంటి అడ్డు చెప్పరని ప్రియా పేర్కొంది. తెలుగులో కొన్ని చర్చ దశలో ఉండగా, తమిళంలో ఒక చిత్రాన్ని చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News