ప్రియమణికి ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. రేపో మాపో పెళ్లిపీటలు కూడా ఎక్కబోతోంది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌తో సుదీర్ఘకాలం పాటు ప్రేమాయణం సాగించాక ఆయన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. మరి ఈ దశలో తరుణ్‌తో పెళ్లేంటి అంటారా? అయితే ఇది ఇప్పటిమాట కాదు. ప్రియమణి టాలీవుడ్‌లో కథానాయికగా బిజీగా ఉన్న సమయంలో తరుణ్‌తో పెళ్లి ఫిక్సయిందంటూ వార్తలొచ్చాయట. అది కూడా తమిళనాడు నుంచి ఎవరో ఫోన్ చేసి ఇది నిజమేనా? అని ప్రియమణిని అడిగారట. ఆ విషయాన్ని ఇటీవల ఓ టీవీ షోలో స్వయంగా బయటపెట్టింది ప్రియమణి. అలీతో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్న ప్రియమణిని మీపై వచ్చిన ఓ భయంకరమైన రూమర్ గురించి చెప్పండని అడిగితే ఆమె తరుణ్‌తో పెళ్లంటూ వచ్చిన రూమర్ గురించి సవివరంగా బయటపెట్టింది. ``సినిమాల్లో నటించడం... ఇంటికెళ్లడం తప్ప నాకు మరో వ్యాపకం లేని రోజులవి. ఉన్నట్టుండి చెన్నై నుంచి మేగజైన్‌కి చెందిన వ్యక్తులు ఫోన్ చేశారు. మీకు తరుణ్‌తో పెళ్లి ఫిక్సయ్యిందట కదా, బహుమతిగా ఆయన ఓ లగ్జరీ కారు కూడా ఇచ్చాడట కదా అని అడిగారు. ఆ మాట నాకు కోపం తెప్పించింది. అసలు ఇలాంటివి నాపైనే ఎందుకు పుట్టిస్తున్నారు అంటూ కోప్పడిపోయాను. ఆ తర్వాత కూడా చాలా బాధపడ్డాను. కానీ మా నాన్న నాకు ధైర్యం చెప్పారు. అప్పటికి నాకు ఇన్నొవా కారు మాత్రమే ఉండేది. అయినా కారు ఇస్తా ఇస్తా ఇలాంటి కారు ఇచ్చావేంటి? అందరూ అనుకుంటున్నట్టుగానే లగ్జరీ కారు ఇవ్వొచ్చు కదా అని తరుణ్‌తో చెప్పేదాన్ని. ఆ విషయం గుర్తు చేసుకొని మేమిద్దరం కలిసినప్పుడు ఇప్పటికీ నవ్వుకుంటుంటాం`` అని చెప్పుకొచ్చింది ప్రియమణి.