'విడాకుల వార్త‌' పై ప్రియానిక్ దావా

Update: 2019-04-02 15:14 GMT
ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్  ప్రేమ‌ - పెళ్లి వ్య‌వ‌హారం గురించి తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత పీసీ త‌న లైఫ్ లో ప్ర‌తి అచ్చ‌ట ముచ్చ‌ట‌ను సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌కు చేర‌వేస్తూనే ఉంది. నిక్ తో అత్త మామ‌ల‌తో - నిక్ కుటుంబ స‌భ్యుల‌తో తాను ఎంత హాయిగా జీవితాన్ని లీడ్ చేస్తోందో ఆ ఫోటోల్లో బ‌య‌ట‌ప‌డింది. అయితే క‌ళ్ల ముందు క‌నిపించేదంతా అబ‌ద్ధం .. అస‌లు నిజం ఇదీ! అంటూ అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత OK! మ్యాగ‌జైన్ ప్ర‌చురించిన క‌థ‌నం పెను సంచ‌ల‌న‌మైంది. పెళ్లి చేసుకున్న 117 రోజుల్లోనే ఈ జంట క‌ల‌త‌ల‌తో విడిపోయేందుకు రెడీ అవుతోంది. తొంద‌ర్లోనే విడాకులు తీసుకోనున్నార‌ని క‌థ‌నాన్ని వండి వార్చింది. ఊహించ‌ని ఆ క‌థ‌నానికి పీసీ అభిమానులు ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. ఇంత‌లోనే అలా జ‌రుగుతోందా? అస‌లేమైంది? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

`ఓకే!` మ్యాగ‌జైన్ క‌థ‌నం ప్ర‌కారం.. ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ మ‌ధ్య నిరంత‌రం గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఒక‌రంటే ఒక‌రికి పొస‌గ‌డం లేదు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వ‌య‌సు తేడా కూడా ఈ గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మ‌ని క‌థ‌నం ప్ర‌చురించింది. చేసే ప‌ని.. పార్టీలు.. పేమెంట్లు.. ఇంట్లో క‌లిసి ఉండ‌డం ప్ర‌తిదీ స‌మ‌స్య‌గానే మారింది. పీసీ నుంచి విడిపోవాల్సిందిగా నిక్ ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ తొంద‌ర పెట్టార‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. నాలుగు నెల‌లైనా గ‌డ‌వ‌క ముందే ఇలా అయ్యిందేంటి?  విడాక‌కుల‌ నిర్ణ‌యం తీసుకుంటున్నారా అంటూ అంతా నోరెళ్ల‌బెట్టారు. పెళ్లి త‌ర్వాత పీసీ త‌న ప్ర‌తి క్ష‌ణాన్ని త‌న జీవితంలో జ‌రిగిన ప్ర‌తిదీ అభిమానుల‌తో షేర్ చేసుకుంటోంది. త‌న భ‌ర్త‌తో ఎంతో అన్యోన్యంగా ఉన్న‌ప్ప‌టి ఫోటోల్ని త‌ను షేర్ చేసింది. దాంతో అభిమానులెవ‌రూ ఆ సంగ‌తిని న‌మ్మ‌లేక‌పోతున్నారు.

మియామీలో హాలీడే వెకేష‌న్ లో ఉన్న‌ప్పుడు ఓకే మ్యాగ‌జైన్ ఈ క‌థ‌నాన్ని అల్లింది. ఉన్న‌వి లేనివి క‌లిపి క‌ట్టు క‌థ‌లు రాసిన స‌ద‌రు మ్యాగ‌జైన్ సెన్సేష‌న్ కోసం పాకులాడింది. అందుకు త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సిందేన‌ని ప్రియానిక్ త‌ర‌పున లాయ‌ర్ల బృందం ప్రిప‌రేష‌న్ లో ఉందిట‌. త‌మ‌పై స‌ద‌రు మ్యాగ‌జైన్ రాసిన క‌థ‌నంపై ప్ర‌స్తుతం ప్రియానిక్ జంట కోర్టుకెక్క‌నున్నారు. భారీ మొత్తంలోనే దావా వేయ‌నున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News