గిల్డ్ పై సి. క‌ల్యాణ్ సంచ‌లన‌ కామెంట్స్.. గిల్డ్ అంతా డొల్లేనా?

Update: 2022-07-27 08:31 GMT
పెడుతున్న ఖ‌ర్చుల‌కు వ‌స్తున్న రాబ‌డికి ఎక్క‌డా పొంత‌న కుద‌ర‌డం లేద‌ని, క‌రోనా త‌రువాత గ‌త కొంత కాలంగా సినిమాల నిర్మాణం ప‌రంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామ‌ని, ఆర్థికంగా భారీగా న‌ష్టాల‌ని చ‌వి చూస్తున్నాయ‌ని ఈ విష‌యంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ఓ కొలిక్కి వ‌చ్చాకే సినిమాల నిర్మాణాన్ని తిరిగి చేప‌ట్టాల‌ని అంత వ‌ర‌కు అంటే ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల‌ని నిర‌వ‌ధికంగా బంధ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ మంగ‌ళ‌వారం సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ప్ర‌క‌టించిన బంద్ పై మిగ‌తా ప్రొడ్యూస‌ర్ లు భిన్నాభిప్రాయాల‌ని వ్య‌క్తం చేస్తున్నారు. సి. క‌ల్యాణ్ మాత్రం ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ పై తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. గిల్డ్ అనేది జీరో.. ఇండ‌స్ట్రీకి చిన్న నిర్మాత‌లే దిక్కు అంటూ సి. క‌ల్యాణ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తాజా వ్యాఖ్య‌ల‌తో ప్రొడ్యూస‌ర్ల‌లో షూటింగ్ ల బంద్ విష‌యంలో చీలిక ఏర్ప‌డింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.  

గిల్డ్ చేసిన తాజా ప్ర‌క‌ట‌న‌పై సి. క‌ల్యాణ్ తాజాగా స్పందించారు. మా దృష్టిలో గిల్డ్ అన్న‌ది సున్నా. అందులో వున్న‌ది కొంత మంది నిర్మాత‌లే. వారంతా క‌లిసి ఏడాదికి ఓ 40 నుంచి 50 సినిమాలు మాత్ర‌మే తీస్తారు. చిన్న నిర్మాత‌లంతా క‌లిసి దాదాపు 200 నుంచి 250 వ‌ర‌కు సినిమాలు తీస్తారు. సినీ ప‌రిశ్ర‌మ‌ను పోషించేది చిన్న నిర్మాత‌లే. కావాలంటే గిల్డ్ నిర్మాత‌లు వారు నిర్మిస్తున్న సినిమాల నిర్మాణం ఆపేసుకోవ‌చ్చు.  

ప‌రిశ్ర‌మ‌కంటూ అధికారికంగా కొన్ని ఆర్గ‌నైజేష‌న్స్ వున్నాయి. ఏ నిర్ణ‌య‌మైనా ఆయా సంస్థ‌ల‌కు సంబంధించిన వాళ్లే తీసుకుంటారు. మేమైతే షూటింగ్స్ బంద్ చేయ‌ట్లేదు' అని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ పై సి. క‌ల్యాణ్ ఘాటుగా స్పందించారు.

ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షుడు కొల్లి రామ‌కృష్ణ కూడా ఇదే త‌ర‌హాలో స్పందించారు. చిత్రీక‌ర‌ణ‌లు నిలిపివేయ‌డం అన్న‌ది గిల్డ్ నిర్మాత‌ల వ్య‌క్తిగ‌త మ‌న్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ త‌రుఫున చిత్రీక‌ర‌ణ‌లు య‌ధావిధిగా న‌డుస్తాయి.

బుధ‌వారం జ‌ర‌గ‌నున్న సమావేశంలో ఓటీటీ, వీపీఎఫ్‌, టికెట్ ధ‌ర‌లు, నిర్మాణ వ్య‌యాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం. దిల్ రాజు, సునీల్ నారంగ్‌, దాము, సి. క‌ల్యాణ్‌, సుప్రియ‌, ముత్యాల రాందాసు త‌దిత‌రులు ఈ స‌మావేశంలో పాల్గొంటారు' అని ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షుడు కొల్లి రామ‌కృష్ణ స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News