తప్పు ఎవరిది-హీరోదా? నిర్మాతదా?

Update: 2018-01-05 09:53 GMT
అనగనగా ఒక నిర్మాత. ఆ మధ్య తమిళ్ లో ఒక సినిమా డబ్బింగ్ హక్కులు కొన్నాడు. హీరో తెలుగువాడే. ఇప్పుడిప్పుడే పైకొస్తున్నాడు. హీరొయిన్ బాగా పేరున్న బ్యాచ్. సెట్స్ మీద ఉన్న మూవీస్ కూడా అన్ని క్రేజీవే. ఇంకేం ఎంతో కొంత బిజినెస్ చేసుకోవచ్చు అనే నమ్మకంతో సినిమా కొన్నాడు. ఒకేసారి తమిళ్ తో పాటు ఇక్కడ కూడా విడుదల చేద్దాం అనుకున్నాడు కాని సరైన డేట్ దొరక్క ఓ మూడు వారాలు ఆలస్యం చేసాడు. సినిమా విడుదలైంది. వచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు. పేరు చెబితే అవునా ఈ సినిమా రిలీజ్ కూడా అయ్యిందా అని ప్రేక్షకులు అడిగేదాకా వచ్చింది పరిస్థితి. ఫలితం. తమిళ్ లో మంచి హిట్ అనిపించుకుని టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ లో ఉందని ప్రశంశలు అందుకున్న ఈ సినిమా ఇక్కడ ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.

ఇప్పుడు ఆ నిర్మాత లబోదిబోమంటున్నాడు. విడుదలైన ఆ సినిమా బాగుందని సదరు హీరో అభిమాని ట్వీట్ చేస్తే తూచ్ అదసలు ఒరిజినల్ వెర్షన్ కాదు నేను డబ్బింగ్ కూడా చెప్పలేదు అని చెప్పడంతో అసలు గందరగోళం స్టార్ట్ అయ్యింది. ఇలా కాదు త్వరలో అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది అప్పుడు చూడండి అని హీరో చెప్పడం మరో కొసమెరుపు. అసలు హక్కులు ఎవరు కొన్నారు, ఇపుడు ఎవరు రిలీజ్ చేసారు - థియేటర్ల దాకా సినిమా ఎలా వచ్చింది అనేది హీరోకు తెలియకుండా జరిగిపోవడం అసలు ట్విస్ట్. పైగా అసలు నిర్మాత ఈయన కాదు అంటూ హీరో - హీరొయిన్ సహాయ నిరాకరణ ఉద్యమం చేయటంతో ఏదో అలా అలా నడుస్తున్న ఈ సినిమాపై మొత్తానికే తాటిపండు పడి పచ్చడై పోయింది. ఇప్పుడు నిర్మాతను - సినిమాను ఎవరు కాపాడలేని స్థితికి వచ్చింది. అవగాహన లోపం - కమ్యునికేషన్ గ్యాప్ ఉంటే ఫలితం ఇలాగే దారుణంగా ఉంటుంది - పరిశ్రమలో అయినా బయట ఎక్కడైనా.
Tags:    

Similar News