పాన్ ఇండియా మోజులో నిండా మునిగిన నిర్మాత..?

Update: 2022-07-06 14:30 GMT
టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా మోజులో ఉన్నారు. ప్రతీ ఒక్కరూ మల్టీ లాంగ్వేజ్ లలో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ ని విస్తరించుకొని, ఒక్కసారిగా నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకోడానికి ఆరాటపడుతున్నారు. అయితే క్రేజ్ - ఇమేజ్ - స్టార్డమ్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా అంటూ ప్రాకులాడటమే నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ యువ హీరో ఒకరు దశాబ్దం క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో ఒకటీ రెండు హిట్లు అందుకున్న అతను.. వాటితోనే ఇన్నేళ్లుగా నెట్టుకొస్తున్నాడు. హీరోగా నిలదొక్కుకోడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ.. ఏదీ కలిసి రావడం లేదు. విభిన్నమైన జోనర్స్ లో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటున్నాడు కానీ.. సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు.

బ్లాక్ బస్టర్ అనేది యంగ్ హీరోకి అందని ద్రాక్షలా మారింది. అయితే సినిమా మీదున్న ప్యాషన్ తో ఇండస్ట్రీలో పరిచయాలతో ఆఫర్స్ మాత్రం బాగానే అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతనితో ఓ పాన్ ఇండియా మూవీ చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు.

తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలలో భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశారు. స్టార్ క్యాస్టింగ్.. టాప్  టెక్నిషియన్స్ ను ఇందులో భాగం చేశారు. ఇప్పటికే మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. దీని కోసం బాగానే ఖర్చు అయింది. దీంతో నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని టాక్ నడుస్తోంది.

ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కి దాదాపు 35 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. ఇంకా సినిమా పూర్తి చేయడానికి 6 కోట్ల దాకా అవసరం అవుతుంది. అంటే మూవీ కంప్లీట్ అవడానికి 41 కోట్లు ఖర్చయినట్లే. కానీ అంతగా మార్కెట్ లేని సీ క్యాటగిరీ హీరోతో అంత పెట్టుబడి వెనక్కి రాబట్టడం కష్టమే. అతని గత సినిమాల లెక్కల ప్రకారం అంచనా వేసుకున్నా.. మూవీ బ్లాక్ బస్టర్ అయితే గరిష్టంగా రూ. 20 కోట్లు వసూలు చేయగలదు.

ఈ ట్రేడ్ మ్యాథ్స్‌ అన్నీ ఆలోచించుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ నిర్మాతకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని.. ఏ ఫైనాన్షియర్ కూడా సాయం అందించడం లేదని టాక్ వినిపిస్తోంది. హీరో మార్కెట్ గురించి పట్టించుకోకుండా పాన్ ఇండియా అంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News