వివాదంలో తెలుగు విల‌న్..కేసు పెట్టిన నిర్మాత‌!

Update: 2022-12-09 09:35 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'ఠాగూర్‌' సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన బాలీవుడ్ విల‌న్ షాయాజీ షిండే. 2003లో విడుద‌లైన ఈ మూవీ తెలుగులో విల‌న్ గా షాయాజీ షిండే కు ఏ స్థాయి గుర్తింపుని తెచ్చిపెట్టిందో అంద‌రికి తెలిసిందే. గ‌త రెండు ద‌శాబ్దాలుగా టాలీవుడ్ లో విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా, ఫాద‌ర్‌గా ప‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నారు. మ‌రాఠీలో థియేట‌ర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన షాయాజీ షిండే ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, త‌మిళ‌, మార‌ఠీ, హిందీ, ఇంగ్లీష్ తో క‌లిపి 9 భాష‌ల్లో న‌టుడిగా కొన‌సాగుతుండ‌టం విశేషం.

రీసెంట్ గా 'గాడ్ ఫాద‌ర్‌' మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన షాయాజీ షిండే తాజాగా ఓ మ‌రాఠీ మూవీ కార‌ణంగా వివాదంలో చిక్కుకున్నారు. మ‌రాఠీ షాయాజీ షిండే మాతృభాష‌. ఇదే భాష‌లో థియేట‌ర్ ఆర్టిస్ట్ గా, సినీ న‌టుడిగా అలరిస్తున్న షాయాజీ షిండే పై అక్క‌డి నిర్మాత పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రాఠీ నిర్మాత స‌చిన్ స‌న‌న్ తాజాగా షాయాజీ షిండే పై పోలీసుకు ఫిర్యాదు చేశారు. త‌న సినిమాలో న‌టిస్తాన‌ని రూ. 5 ల‌క్ష‌లు తీసుకుని న‌టించ‌క‌పోగా తిరిగి ఇవ్వలేద‌ని, త‌న వ‌ల్ల రూ.17 ల‌క్ష‌లు న‌ష్ట‌పోయాన‌ని ఫిర్యాదు చేయ‌డంతో వివాదం వెలుగులోకి వ‌చ్చింది.  

మ‌రాఠీ మూవీ 'గిన్నాద్‌'లో ఓ కీల‌క పాత్ర కోసం షాయాజీ షిండే ని సంప్ర‌దించార‌ట‌. స్టోరీ విని సినిమా చేస్తాన‌ని అంగీక‌రించాడ‌ట‌. అయితే త‌న సినిమాకు డేట్స్ కేటాయించిన షాయాజీ షిండే ఆ స‌మ‌యంలో షూటింగ్ కు హాజ‌రు కాలేద‌ని, ఆ కార‌ణంగా తాను న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడట‌. షూటింగ్ కు హాజ‌రు కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణం ఏంట‌ని షాయాజీ షిండేని ఆడిగితే స‌మాధానం లేద‌ని స‌ద‌రు నిర్మాత పోలీసుకు ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
 
అంతే కాకుండా ముందు అనుకున్న క‌థ‌లో త‌న పాత్ర‌కు మార్పులు చేయ‌మ‌న్నాడ‌ని, అది కుద‌ర‌ద‌ని చెప్ప‌డంతో సెట్ లో గొడ‌వ‌కు దిగాడ‌ని స్ప‌ష్టం చేశాడు. అయితే త‌న కార‌ణంగా సెట్ లో ఆ రోజు షూటింగ్ ఆగిపోయింద‌ని, ఆ కార‌ణంగా తాను రూ. 17 ల‌క్ష‌లు న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని విచారం వ్య‌క్తం చేశాడు.

ఈ న‌ష్టం మొత్తం త‌న‌కు తిరిగి ఇప్పించాల‌ని పోలీసుల‌తో పాటు అఖిల భార‌త మ‌రాఠీ ఫిల్మ్ కార్పొరేష‌న్ లోనూ నిర్మాత ఫిర్యాదు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి ఈ వివాదంపై షాయాజీ షిండే ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News