సురేష్ బాబు వదలట్లేదుగా..

Update: 2022-07-20 02:30 GMT
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్లలో ఒకడైన సురేష్ బాబు.. ఇంతకుముందులా భారీ సినిమాల జోలికి అస్సలు వెళ్లట్లేదు. చాలా వరకు వేరే నిర్మాతల కాంబినేషన్లలో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలే చేస్తూ రిస్క్ లేకుండా చూసుకుంటున్నారు. గత కొన్నేళ్లలో ఆయన చాలా రీమేక్ సినిమాల్లో భాగస్వామి అయ్యారు.

వెంకీని హీరోగా పెట్టి గురు, నారప్ప, దృశ్యం-2 చిత్రాలు తీశారు. వీటి తర్వాత సురేష్ బాబు తమిళ బ్లాక్‌బస్టర్ ‘మానాడు’ రీమేక్ హక్కులు కూడా కొన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ సినిమాను రూపొందించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సినిమా అనగానే అది ‘మానాడు’ రీమేకే అయ్యుండొచ్చని, సురేష్ బాబే నిర్మిస్తారని జోరుగా ప్రచారం జరిగింది.

కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. చైతూ కోసం వెంకట్ ప్రభు వేరే కథ రెడీ చేసి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మరి ‘మానాడు’ రీమేక్ సంగతేంటన్నది అప్పుడు అర్థం కాలేదు.


ఐతే ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు. వెంకట్ ప్రభుతో తాను చేస్తున్నది రీమేక్ మూవీ కాదని మరోసారి క్లారిటీ ఇస్తూ.. ‘మానాడు’ రీమేక్‌లో తన కజిన్ రానా దగ్గుబాటి నటించబోతున్నట్లు తెలిపాడు. అంతకుమించి అతను వివరాలేమీ చెప్పలేదు.

కానీ ‘మానాడు’ సినిమా సోనీ లివ్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. ఆ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ కావడం, సోషల్ మీడియాలో దాని గురించి చాలా చర్చ జరగడంతో మన ప్రేక్షకులు బాగానే చూశారు. ఇలాంటి సినిమాను ఇప్పుడు తెలుగులో మళ్లీ రీమేక్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

మామూలుగానే ఇప్పుడసలు రీమేక్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కావట్లేదు. అందులోనూ తెలుగులో అందుబాటులో ఉన్న, జనం బాగా చూసిన సినిమాను రీమేక్ చేసి ఏం సాధిస్తారన్నది ప్రశ్నార్థకం. ఐతే రీమేక్ హక్కులు కొన్నారు కాబట్టి సినిమా చేసి తీరతారేమో సురేష్ బాబు. మరి జనం ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News