నిర్మాత‌ల్ని టెన్ష‌న్ పెడుతున్న మామ

Update: 2019-10-03 04:35 GMT
విక్ట‌రీ వెంక‌టేష్ - నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ సినిమా వెంకీ మామ. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.సురేష్ బాబు- విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లు. సినిమాని ప్రారంభించింది మొద‌లు ఏమాత్రం గ్యాప్ లు లేకుండా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు. అయినా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఓ కొలిక్కి రాక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటా? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అయితే దానికి ఓ కార‌ణం ఉంద‌ని తెలుస్తోంది.

వెంకీమామ కాన్వాసు అంత‌కంత‌కు పెరుగుతోంది. తొలుత అనుకున్న బ‌డ్జెట్ ను ఎప్పుడో క్రాస్ చేసింది. ఇప్ప‌టికే 55కోట్ల మేర బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఇదే నిజం అనుకుంటే వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీగా నిల‌వ‌డం ఖాయం అన్న చ‌ర్చ సాగుతోంది. అయితే అదుపు త‌ప్పుతున్న బ‌డ్జెట్ విష‌యంలో పీపుల్స్ మీడియా సంస్థ కొంత హ‌ర్రీగానే ఉంద‌ని తెలుస్తోంది. దీంతో నిర్మాత‌లు కాస్ట్ కటింగ్ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని భావిస్తున్నార‌ట‌.

అయితే ఈ సినిమాకి ఎంచుకున్న క‌థాంశం చాలా పెద్ద స్పాన్ ఉన్న‌ది. పైగా దేశ‌భ‌క్తి నేప‌థ్యం.. నాగ‌చైత‌న్య పాత్ర‌లో ట్విస్టులు వ‌గైరా ఆస‌క్తిక‌రంగా ఉంటాయిట‌. అయితే వెంకీ- చైత‌న్య రేంజును మించి బ‌డ్జెట్ పెట్ట‌డం సాహ‌స‌మే అవుతుంద‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. అక్టోబ‌ర్ లోనే రిలీజ్ కావాల్సిన సినిమా తాజా స‌మాచారం ప్ర‌కారం.. డిసెంబ‌ర్ కి వాయిదా ప‌డుతోంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాశీఖ‌న్నా-పాయ‌ల్ రాజ్ పుత్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.


Tags:    

Similar News