'PS-1' వివాదం.. కమల్ కీలక వ్యాఖ్యలు..!

Update: 2022-10-06 11:30 GMT
ఇటీవల 'పొన్నియన్ సెల్వన్ 1' సినిమా విడుదలైన నేపథ్యంలో తమిళ తెలుగు ప్రేక్షకుల మధ్య ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లెజండరీ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొనడబడిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. తమిళ్ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. కానీ ఇతర భాషల్లో ఆశించిన మేరకు ప్రభావం చూపలేకపోయింది.

ముఖ్యంగా తెలుగులో 'PS 1' సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. మొదటి నుంచీ తమిళ అభిమానులు ఈ చిత్రాన్ని 'బాహుబలి' తో కంపేర్ చేస్తూ రావడం.. సినిమా ఆ స్థాయిలో లేకపోవడంతో తెలుగులో తేడా కొట్టేసింది. కథంతా తమిళులకు మాత్రమే కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో ఇక్కడ నిరాదరణకు గురైంది. టాలీవుడ్ క్రిటిక్స్ రివ్యూలు రేటింగ్స్ కూడా అలానే ఉన్నాయి.

ఈ విషయంలో తమిళ సినీ అభిమానులు హర్ట్ అవ్వడంతో.. అది కాస్తా వివాదంగా మారింది. ఇకపై తెలుగు సినిమాలను చూడమంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేయడంపై తెలుగు జనాలు మండిపడ్డారు. కోలీవుడ్ స్టార్స్ ని నెత్తిన పెట్టుకొని చూసుకునే తెలుగు సినిమాని ప్రేక్షకులను కించపరుస్తారా అంటూ వాదోపవాదాలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై కోలీవుడ్ సీనియర్ హీరో, విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. "సినిమా బాగుంటే ఏ భాషలో అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. మనం 'శంకరాభరణం' ఆదరిస్తే.. వాళ్ళు మన 'మరో చరిత్ర' ను ఆదరించారు. 'పొన్నియిన్ సెల్వన్' అనేది ఒక తమిళ చారిత్రక కథ. దాన్ని ఇతర భాషల వారు ఆదరించాలనే నియమం లేదు. దీనికి ఇతర భాషల ప్రజలను దూషించడం తగదు" అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా అసలు చోళరాజులు హిందువులు కాదని కమల హాసన్ కామెంట్స్ చేశారు. రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వమే లేదని.. అప్పట్లో హిందూమతం లేదని.. శైవం - వైష్ణవం మాత్రమే ఉన్నాయని అన్నారు. మనదేశంలోకి బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత మనల్ని ఎలా పిలవాలో తెలియక హిందువులని సంబోధించారని కమల్ పేర్కొన్నారు. కళలకు భాష, కులం, మతం లేదని.. వీటి ప్రాతిపదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు చేయడం మంచిది కాదని కమల్ అభిప్రాయ పడ్డారు.

ఇకపోతే ఇటీవల 'ది ఘోస్ట్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇదే విషయం మీద ప్రశ్న ఎదుర్కొన్నారు. 'పొన్నియిన్ సెల్వన్' సినిమా బాగుందని.. తాను ఆ నవలని కూడా చదివానని తెలిపారు నాగ్. 'బాహుబలి' సినిమాతో పోల్చి ట్రోల్ చేసేవారిని నమ్మవద్దని పేర్కొన్నారు.

మణిరత్నంను అభినందించాలి. ఆయన అద్భుతాలు సృష్టిస్తారని మరోసారి రుజువైంది. ఈ సినిమా ఆయన ఏన్నో ఏళ్ల కల. దీని గురించి నాతో చాలా సార్లు మాట్లాడారు. 1988లో ఆయనతో కలిసి 'గీతాంజలి' సినిమా తీసిన క్షణాలు నాకు ఎప్పటికీ మధురమైన జ్ఞాపకాలు. అతని పనితీరు ప్రశంసనీయమైంది. అలాగే 'పొన్నియిన్ సెల్వన్' టీం అందరికీ అభినందనలు చెప్పాలి. హీరో విక్రమ్ - నా తమ్ముడు కార్తి - జయం రవి - ఐశ్వర్య రాయ్ - త్రిష - ఏఆర్ రెహమాన్.. అందరికీ పేరుపేరున అభినందనలు. అందరూ కలిసి అద్భుతమైన సినిమాని అందించారు" అని నాగార్జున చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News