PS-1 ట్రైల‌ర్ : భారీ ఎమోష‌న‌ల్ వారియ‌ర్ డ్రామా.. మ‌ణిర‌త్నం మార్క్ తో!

Update: 2022-09-07 04:08 GMT
చ‌రిత్ర‌లో ఎన్నో అద్భుత క‌థ‌లు దాగి ఉన్నాయి. వాటిని వెలికి తీసే స‌మ‌ర్థులైన ద‌ర్శ‌కుల అవ‌స‌రం ఎంతైనా ఉంది. ప్ర‌జ‌ల్ని థియేట‌ర్ల‌కు లాక్కొంచేంత ప‌నిత‌నం ప్ర‌ద‌ర్శించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ విష‌యంలో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళిని కొట్టేవాళ్లే లేర‌ని నిరూప‌ణ అయ్యింది. బాహుబ‌లి 1- బాహుబ‌లి 2- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో నిరూపించారు. ఆ త‌ర్వాత హిస్ట‌రీలోని వీరుడి క‌థ‌తో సైరా - న‌ర‌సింహారెడ్డిని తెర‌కెక్కించారు సురేంద‌ర్ రెడ్డి. కానీ ఈ సినిమా ఆశించిన రేంజుకు చేర‌లేదు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కదిగ్గ‌జం మ‌ణిర‌త్నం కూడా ఒక భారీ హిస్టారిక‌ల్ మూవీని తెర‌కెక్కిస్తూ కొంత‌కాలంగా చ‌ర్చ‌ల్లో నిలిచారు.

మణిరత్నం తెర‌కెక్కించిన హిస్టారిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 (PS-1)' ట్రైల‌ర్ లాంచ్ అయ్యింది. సెప్టెంబర్ 6 మంగళవారం నాడు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో స‌హా ట్రైల‌ర్ ని రిలీజ్ చేసారు. ట్రైల‌ర్ య‌థావిధిగా ఒక అంద‌మైన హిస్ట‌రీ క‌థాంశాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మిద‌ని చెబుతోంది. రానా వాయిస్ ఓవ‌ర్ తో తెలుగు ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది.

ఈ కథ రాజ్యాధికారం కోసం కిరీటం కోసం పోరాటం నేప‌థ్యంలో సాగ‌నుంది. యువరాజు ఆదిత్య కరికాలన్ నుండి సందేశాన్ని అందించడానికి చోళ రాజ్యానికి వెళ్లిన వంతీయతేవన్ చుట్టూ క‌థాంశం తిరుగుతుంది.  విక్రమ్ ఆదిత్య కరికాలన్ గా న‌టించ‌గా .. యోధ యువరాజు వల్లవరైయన్ వంతీయతేవన్ గా కార్తీ నటించారు. ఐశ్వర్య రాయ్ రాణి నందినిగా న‌టించ‌గా..చోళ యువరాణి కుందవై పిరత్తియార్ పాత్రలో త్రిష నటించింది. జయం రవి అరుల్మొళి వర్మన్ (పొన్నియన్ సెల్వన్) పాత్రను పోషించారు. అత‌డు రాజ రాజ చోళగా గౌర‌వం అందుకున్న హిస్టారియ‌న్. రాజ్యం కోసం రాజ్యాధికారం కోసం పోరాటం అన‌గానే కుట్ర‌లు కుతంత్రాలు కుయుక్తులు వంటివి ఎన్నో ఉంటాయి. భారీ యుద్ధాలకు దారి తీస్తాయి.

పీఎస్ -1 లో అలాంటి వాటికి కొద‌వేమీ లేదు. రాత్రికి రాత్రే దండ‌యాత్ర‌కు బ‌య‌ల్దేరే నావ‌లు స‌ముద్రంలో అల్ల‌క‌ల్లోల వాతావ‌ర‌ణం .. బాణాల‌తో దాడులు .. యువ‌రాణితో రాకుమారుడి రొమాన్స్ ఇలా రంజైన క‌థ‌తోనే పీఎస్ 1 తెర‌కెక్కింది. మ‌ణిర‌త్నం మార్క్ పోయెటిక్ ట‌చ్ ప్ర‌తి ఫ్రేమ్ లోనూ క‌నిపిస్తోంది. కొంత ఆల‌స్య‌మైనా పీఎస్ 1 ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. కార్తీ పాత్ర ఇందులో కామిక్ ట‌చ్ తో కొంత రిలీఫ్ నిస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అలాగే ఐశ్వ‌ర్యారాయ్ ఎక్స్ ప్రెష‌న్ లో విల‌నీ ట‌చ్ కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాజుల యుద్ధాల‌కు రాణులు కూడా ఒక కార‌ణం అన్న ఎలిమెంట్ ని ఇందులో ట‌చ్ చేసార‌ని ఐష్ పాత్ర వెల్ల‌డిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 1954లో ప్రచురించబడిన కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ యొక్క మొదటి రెండు నవలల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం.

ఇక ఆడియో ఈవెంట్ హైలైట్స్ ని ప‌రిశీలిస్తే... పార్లమెంటు సభ్యుడు .. రచయిత సుతోపాటు సూప‌ర్ స్టార్ రజనీకాంత్ .. విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. వెంకటేశన్- దర్శకుడు శంకర్ - సంగీత విద్వాంసులు యువన్ శంకర్ రాజా- సంతోష్ నారాయణన్ - విక్రమ్- ఐశ్వర్యరాయ్- త్రిష కృష్ణన్- కార్తీ - జయం రవి సహా తారాగణం ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నియన్ సెల్వన్ రచయిత కల్కి మనవరాలు గౌరీ నారాయణన్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా తమిళం- మలయాళం- కన్నడ- తెలుగు- హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్రైలర్ దాదాపు మూడు లక్షల వ్యూస్ సాధించింది.

ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగీత స్వరకర్త AR రెహమాన్ PS-1లోని పాటలను లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించారు. పొన్ని నది .. చోళ చోళ అనే పాటలు గత నెలలో విడుదలై ఇన్ స్టంట్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలోని మరో నాలుగు పాటలు విడుదలై ఆక‌ట్టుకున్నాయి.

ఐదు భాషల్లో విడుదలైన PS1 ట్రైలర్ కు తమిళంలో నటుడు కమల్ హాసన్.. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్.. తెలుగులో రానా దగ్గుబాటి .. కన్నడకు జయంత్ కైకిని .. హిందీకి అనిల్ కపూర్ వాయిస్ ఓవ‌ర్ ల‌ను అందించారు.

దర్శకుడు మణిరత్నం - AR రెహమాన్‌ల మధ్య 30 సంవత్సరాల స్నేహం స‌హ‌కారం పొన్నియన్ సెల్వన్ కి  పెద్ద ప్ల‌స్ కానుంది. ఆ ఇద్దరూ మొదట 'రోజా' మూవీ కోసం కలిసి పనిచేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈవెంట్‌లో గాయకులు వేదికపై ARR 90ల నాటి గొప్ప హిట్ లను ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ ను.. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ను నిర్వహిస్తున్నారు. దర్శకుడు మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్ గా చెబుతున్న ఈ సినిమా దేశంలోనే ఇప్పటివరకు తెర‌కెక్కించిన‌ అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ లలో ఒకటి. దర్శకుడు మణిరత్నంతో పాటు రచయితలు జయమోహన్ - కుమారవేల్ స్క్రీన్ ప్లే రాశారు. శోభితా ధూళిపాళ - శరత్ కుమార్- ఐశ్వర్య లక్ష్మి - ప్రభు- శరత్ కుమార్- పార్థిబన్- విక్రమ్ ప్రభు- ప్రకాష్ రాజ్- జయరామ్- జయచిత్ర, రెహమాన్, అశ్విన్ కాకుమాను, కిషోర్, నిజల్‌గల్ రవి మరియు వినోదిని తారాగణం. ఈ సినిమా టీజర్ జూలై 9న లాంచ్ చేసారు. హై యాక్షన్ యుద్ధ సన్నివేశాలు.. సముద్ర ప్రయాణాలు.. పొలిటికల్ డ్రామాని తొలి టీజ‌ర్ లోనే ఆవిష్క‌రించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View

Tags:    

Similar News